Share News

మాకూ మండలం కావాలి..

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:58 AM

‘‘మాకు మండలం కావాలి..’’ అనే డిమాండ్లు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది కొంత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జిల్లాలో ఎప్పటినుంచో మంథని మండలం గుంజపడుగు, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిని మండలాలుగా చేయాలనే ప్రతిపాదనలున్నాయి.

మాకూ మండలం కావాలి..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

‘‘మాకు మండలం కావాలి..’’ అనే డిమాండ్లు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది కొంత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జిల్లాలో ఎప్పటినుంచో మంథని మండలం గుంజపడుగు, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిని మండలాలుగా చేయాలనే ప్రతిపాదనలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో ఇదే అదనుగా గుంజపడుగు, గర్రెపల్లిని మండలాలు చేసేందుకు మంత్రి, ఎమ్మెల్యేల సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఐదేళ్ల వరకు కొత్త మండలాలు కావని భావిస్తున్న అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మరికొన్నింటిని మండలాలు చేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకవెళుతున్నారు. పది రోజుల క్రితం గుంజపడుగు, గర్రెపల్లికి తోడు పెద్దపల్లి మండలం రాఘావాపూర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న జనగామను అర్బన్‌ మండలంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకరావడంతో ఆ రెండింటిని మండలాలుగా ప్రతిపాదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రామగుండం మున్సిపల్‌ పరిధిలో ఇప్పటివరకు రామగుండం మాత్రమే అర్బన్‌ మండలంగా ఉంది. దీని పరిధిలో రెండున్నర లక్షలకు జనాభా ఉండడంతో ఒక మండలం ద్వారా ప్రధానంగా రెవెన్యూ కార్యాలయం ద్వారా ప్రజలకు కావాల్సిన వివిధ రకాల సర్టిఫికెట్లు వేగంగా జారీ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న జనగామ పేరిట మరొక అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. జనగామ, గోదావరిఖనిటౌన్‌, యైుటింక్లయిన్‌కాలనీ, అల్లూరు, పోతనకాలనీ, వీర్లపల్లి ప్రాంతాలను కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ను మండలంగా చేయాలని ఇందులో సబితం, రంగాపూర్‌, దేవునిపల్లి, అందుగులపల్లి, గట్టుసింగారం, గౌరెడ్డిపేట, అప్పన్నపేట, బ్రాహ్మణపల్లి, రాగినేడు, కనగర్తి, పాలితం, కాపులపల్లి, కాసులపల్లి, కుర్మపల్లి గ్రామాలను కలుపుతూ మండలంగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మండలాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. వీటికి సంబంధించి రెవెన్యూ పరిధి మ్యాపులు కూడా సిద్ధం అయ్యాయి.

ఫ రాజకీయ నాయకులు, ప్రజల నుంచి ఒత్తిడి..

ఓదెల మండలం కొలనూర్‌, ధర్మారం మండలం దొంగతుర్తిని మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఓదెల మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా, కొలనూర్‌ మండల కేంద్రంగా ఓదెల మండలానికి చెందిన ఉప్పరపల్లి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్యపల్లి, గోపరపల్లి, హరిపురంతో పాటు పెద్దపల్లి మండలం కొత్తపల్లి, మూలసాల, సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట, కాల్వశ్రీరాంపూర్‌ మండలం అంకంపల్లి, మడిపల్లి గ్రామాలను కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామాల నాయకులు ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్‌ను కలిసి విపతిపత్రాలు సమర్పించారు. అలాగే ధర్మారం మండలంలో 33 గ్రామపంచాయతీలు ఉండగా, దొంగతుర్తి కేంద్రంగా రచ్చపల్లి, రామయ్యపల్లి, ఖానంపల్లి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, బొట్లవనపర్తి, ఖిలావనపర్తి, పైడి చింతలపల్లి గ్రామాలను కలుపుకుని మండలంగా ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామాల నాయకులు ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో వాళ్లు సానుకూలంగా స్పందించారని ఆయా గ్రామాల నాయకులు చెబుతున్నారు. ఒకటి, రెండు కొత్త మండలాలను చేసే యోచన ఉండగా, మరో నాలుగు మండలాలు కావాలని తెరమీదకు రావడంతో సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మండలం ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని, మండల పరిషత్‌, తహసీల్దార్‌, వ్యవసాయ శాఖ, మండల విద్యాధికారి కార్యాలయాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. వీటికి క్యాడర్‌ స్ర్తెంథ్‌ను మంజూరుచేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వ్యవహారం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఇరకాటంగా మారింది. ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే గాకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి మండలం ఏర్పాటు చేస్తే ఆ క్రెడిట్‌ అంతా తమకే దక్కాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని మండలాలను మంజూరు చేస్తుందో వేచిచూడాల్సిందే.

Updated Date - Jan 12 , 2025 | 01:58 AM