Minister Inspects Hostels:c వసతిగృహాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:08 AM
మంత్రివర్యులు దామోదర రాజనర్సింహా సింగరెడ్డి జిల్లాలోని వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భోజన నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గమనించిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు
భోజనంలో నాణ్యత తగ్గితే జైలుకే: దామోదర రాజనర్సింహా
జోగిపేట, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అందోలు పట్టణంలోని నర్సింగ్, మహిళా పాలిటెక్నిక్, కేజీబీవీ కళాశాలల్లో శనివారం మంత్రి దామోదర రాజనర్సింహా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా కాలేజీల్లోని వసతి గృహాల్లో కిచెన్లను పరిశీలించి సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందజేయాలని, నాణ్యత తగ్గితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. నిర్లక్ష్యంగా, ఇష్టం వచ్చినట్లు భోజనం వండిపెడితే చూస్తూ ఊరుకోబోనన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. కళాశాలల ఆవరణలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం చూసి కోపంతో ఊగిపోయారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటికీ తీరు మారకపోతే తన తడాఖా ఏంటో చూపిస్తానని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం నర్సింగ్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న 100 పడకల ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. నెలరోజుల్లోగా నిర్మాణపనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.