విశాల భవనం..వినియోగంలో లేదేమీ?
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:59 AM
పట్టణ ప్రజల సామూహిక అవసరాలు, స్థానికుల ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా కోట్ల రూపాయల వ్యయంతో దశాబ్దం క్రితం భువనగిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన కమ్యూనిటీ భవనం నిరుపయోగంగా ఉంది.
ఫ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
భువనగిరి టౌన, మార్చి 17(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల సామూహిక అవసరాలు, స్థానికుల ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా కోట్ల రూపాయల వ్యయంతో దశాబ్దం క్రితం భువనగిరి మునిసిపల్ పరిధిలో నిర్మించిన కమ్యూనిటీ భవనం నిరుపయోగంగా ఉంది. ఫలితంగా విశాలమైన ఆ భవనం కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక్కొక్కటి సుమారు రూ.55 లక్షల వ్యయంతో పట్టణంలోని సింగన్నగూడెం, అర్బనకాలనీ ఒక్కోటి చొప్పున రెండు కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. ఆ భవనాలలో స్థానికుల సామూహిక అవసరాల కోసం విశాలమైన హాల్స్, సమావేశాల కోసం ప్రత్యేక గదులు, స్థానికులు ఉపాధి పొందేందుకు మడిగెలు, వ్యక్తిగత అవసరాల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు సువిశాల పార్కింగ్ సదుపాయంతో భవనాలను నిర్మించారు.
సింగన్నగూడెంలో..
సింగన్నగూడెం కమ్యూనిటీ హాల్‌లో కొన్నేళ్ల క్రితం పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయగా తదనంతరం అదే భవనంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పబ్లిక్ రీడింగ్ రూమ్ మూతపడగా కమ్యూనిటీ హాల్ మాత్రం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగపడుతోంది. అయితే ఆ విశాల భవనాన్ని వినియోగించుకుంటున్న పంచాయతీరాజ్ శాఖ మాత్రం మునిసిపాలిటీకి నయా పైసా అద్దెను మాత్రం చెల్లించడం లేదు.
అర్బనకాలనీలో..
అర్బనకాలనీలోని కమ్యూనిటీ భవనం పరిస్థితి పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. నిరుపయోగంగా ఉన్న ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు మందు బాబులకు, ఆనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారి, రాత్రంతా వింత శబ్దాలు, అరుపులు, దూషణలు వెలువడుతూ ప్రతీ రాత్రి కొత్త ముఖాలు, వ్యక్తుల సంచారానికి అడ్డాగా మారిందని స్థానికులు అంటున్నారు. ఎన్నికల ముందు సమయంలో పోలింగ్ బూతకు మాత్రమే వినియోగిస్తూ మిగతా రోజుల్లో నిరుపయోగంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక అవసరాలకు వినియోగించలేని పరిస్థితులు ఉంటే కనీసం ప్రభుత్వ కార్యాలయాల కైనా ఆ భవనాన్ని కేటాయిస్తే పరిసరాల గౌరవం పదిలంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఈ దిశగా అధికారులు దృష్టి పెట్టాలని పలవురు కోరుతున్నారు.
అధికారులు శ్రద్ధ చూపాలి
నిరుపయోగంగా ఉన్న విశాలమైన కమ్యూనిటీ భవనాన్ని వినియోగంలోకి తేవాలి. ఇలాగైతేనే ఆ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ మేరకు గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. కానీ నేటికి స్పందన కరువైంది. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపాలి.
-ఎం.జగదీశ అర్బనకాలనీ, భువనగిరి
వినియోగంలోకి తెస్తాం
నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ భవనాలన్నిటినీ వినియోగంలోకి తెస్తాం. అవసరమైన మరమ్మతులు చేపడుతాం. అర్బనకాలనీలోని కమ్యూనిటీ భవనంలో అర్బనహెల్త్ సెంటర్ నిర్వహించాలని గతంలో వైద్య ఆరోగ్య శాఖను కోరాం. కానీ ఆస్పత్రి నిర్వహణకు భవన ఆధునీకరణ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి వస్తుందని నిరాకరించారు. అయితే ఆ భవన వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
-జి.రామలింగం, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ