Share News

బడ్జెట్‌ వైపే అందరి చూపు

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:31 AM

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా ఆకాంక్షలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయని అంతా భావిస్తున్నారు.

బడ్జెట్‌ వైపే అందరి చూపు

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఉంటుందనే ఆశాభావం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులపై స్పష్టత వచ్చే అవకాశం

ఏఎమ్మార్పీ కెనాల్‌ లైనింగ్‌, ఏదుల-డిండికి నిధులిస్తారనే చర్చ

లిఫ్టులు, మూసీకాల్వలకు దండిగా నిధులొస్తాయనే సంకేతాలు

ఎంజీయూ అభివృద్ధి పనులకు రూ.309కోట్లతో ప్రతిపాదనలు

మహిళా సంఘాలకు రైస్‌మిల్లులపై ప్రకటన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా ఆకాంక్షలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సైతం జిల్లాలో, నియోజకవర్గాల్లో పర్యటించిన పలు సందర్భాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు, పథకాలకు నిధులిప్పిస్తామని ప్రకటించడంతో ఆ మేరకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగమార్గం ప్రాజెక్టు)కు కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి గత బడ్జెట్‌లో రూ.799కోట్ల నిదులు కేటాయించింది. అం తేగాక గ్రీన్‌ఛానల్‌ ద్వారా నిధులివ్వాలని కూడా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనులను ఫిబ్రవరిలో ప్రారంభించగా, దురదృష్టవశాత్తు టన్నెల్‌ కూలి ఎనిమిదిమంది కార్మికులు గల్లంతవగా, పనులకు బ్రేక్‌పడింది. ఈ నేపథ్యంలో గత 26 రోజులుగా టన్నెల్‌వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతుండగా, ఈ పనుల పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు పనుల కొనసాగింపు,రెస్క్యూ ఆపరేషన్‌, రీడిజైన్‌ తదితర అంశాలపై ఈ బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డిండి-ఏదుల అనుసంధానానికి నిధులు!

ఉమ్మడి జిల్లాలో కీలకమైన మరో సాగునీటి ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి ఈ బడ్జెట్‌లో సమగ్రంగా నిధులు కేటాయిస్తారని అంచనావేస్తున్నారు. ఈ పథకంలో కీలకమైన ఏదుల-డిండి అనుసంధానం పనులు రూ.2,400కోట్లతో చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఏడు రిజర్వాయర్ల కు, వాటి పరిధిలోని కాల్వల నిర్మాణాలకు ఈ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయనున్నారు. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.300కోట్లు కేటాయించిన విషయం తెలిసిం దే. వీటితో పాటు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పెండింగ్‌ పనులతో పాటు, ఉమ్మడి జిల్లాలో అసంపూర్తి గా నిలిచిన చిన్న ఎత్తిపోతల పథకాల పూర్తికి, పాత లిఫ్టుల ఆధునికీకరణ, నిర్వహణకు ఈ బడ్జెట్‌ ద్వారా నిధుల కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు.

వీటితో పాటు బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, బెండలమ్మచెరువు, శేషులేటివాగు ఫీడర్‌ ఛానల్‌, కొండాపురం ఫీడర్‌ఛానల్‌ నిర్మాణాలకు నిధులిస్తారనే నమ్మకం కనిపిస్తోంది. గంధమళ్ల రిజర్వాయర్‌ నిర్మాణంతో పాటు, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపుగ్రామాలకు పరిహారం ప్రకటిస్తారని తెలుస్తోంది. మరోవైపు శ్రీరాంసాగర్‌ రెండోదశ చివరి ఆయకట్టు భూములకు నీరందించేందుకు కా ల్వల ఆధునీకరణకు నిధులివ్వాలనే డిమాండ్‌కు మోక్షం లభించాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వైద్యరంగానికి భారీగా నిధులిచ్చే అవకాశం...

పేదలకు నాణ్యమైన వైద్య అందించేందుకు ఈ బడ్జెట్‌లో నిధులిస్తారని భావిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాల్సి ఉంది. మోత్కూరు, మునుగోడు పీహెచ్‌సీలను 30పడకల ఆస్పత్రులుగా ఆప్‌గ్రేడ్‌ చేసి నిధులిస్తారని భావిస్తున్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లోని జనరల్‌ ఆస్పత్రులకు నిధులతో పాటు, ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టుల నియామకానికి ప్రకటన చేస్తారని ఆశాభావం వెల్లడవుతోంది. నల్లగొండ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఏరియా ఆస్పత్రులు కేంద్రంగా నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందుకోసం ఈ బడ్జెట్‌ ద్వారా కార్యాచరణ ప్రకటిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌కు నిధులు

ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద ఉన్న ప్రధాన కాల్వ ఆధునికీకరణకు అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా నీటిపారుదలశాఖ విభాగం నుంచి సుమారు రూ.400కోట్ల పైచిలుకు నిధులతో ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ బడ్జెట్‌లో వీటికి నిధుల కేటాయింపులుంటాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తికి కూడా అవసరమైన నిధులిస్తారని భావిస్తున్నారు.

విద్యాసంస్థలకు ఊతం దక్కేనా?

జిల్లాలో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపరచేలా అవసరమైన డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌ ద్వారా మార్గదర్శనం చేస్తారని భావిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో పీజీ కళాశాల, నార్కట్‌పల్లిలో డిగ్రీ, మిర్యాలగూడలో మహిళా డిగ్రీ, మునుగోడు, కోదాడలో డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని, హాలియాలో ఇప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలకు నూతన భవన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులిస్తారని ఆశిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 12 ఏటీసీలలో (అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు) వచ్చే విద్యాసంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన నియామకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారని భావిస్తున్నారు.

మహిళా సంఘాలకు రైస్‌మిల్లుల బాధ్యత

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇప్పటికే ఇందిరాశక్తి క్వాంటీన్లు, సోలార్‌ ప్రాజెక్టులతో పాటు, పెట్రోల్‌ స్టేషన్లను మహిళా సంఘాలకు కేటాయిస్తున్న ప్రభుత్వం, తాజాగా రైస్‌మిల్లులను మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తయ్యే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహిళా సంఘాలకు సైతం రైస్‌ మిల్లుల ఏర్పాటుకు అవసరమైన నిధులిచ్చేలా ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ప్రాథమిక దశలో నియోజకవర్గానికి ఒక రైస్‌మిల్లునైనా మహిళా సంఘాలు నిర్మించుకునేలా ప్రోత్సాహకం ఈ బడ్జెట్‌ ప్రకటిస్తారని భావిస్తున్నారు.

ఎంజీయూకు రూ.309కోట్లు

మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గత బడ్జెట్‌లో కేవలం నిర్వహణ పద్దు కింద రూ.34.09కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్సిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. ఈ సారి ఉన్నతవిద్యామండలి అనుమతితో పలు అభివృద్ధి పనులకు రూ.309కోట్లతో యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు మంజూరైతే యూనివర్సిటీలో కొత్తగా ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఏ (గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌పాలసీ), ఎంఏ (డెవల్‌పమెంట్‌ స్టడీస్‌), బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అధ్యాపక పోస్టులు, కళాశాల భవనాలను నిర్మిస్తారు. అదేవిధంగా సెల్ఫ్‌పైనాన్స్‌ కోర్సులను కొన్నింటినైనా రెగ్యులర్‌ బడ్జెట్‌ కోర్సులుగా మార్చనున్నారు. అదేవిధంగా ప్రతిపాదించిన మేరకు నిధులిస్తే పానగల్‌లో క్యాంపస్‌, ఇంజనీరింగ్‌ కళాశాల, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర నిర్మాణాలకు ఆస్కారముంటుంది. నిధులు మంజూరయ్యేదాన్నిబట్టి ఉన్నత విద్యామండలి ఏ పనులు చేపట్టాలో నిర్ణయించనుండడంతో ఏమేరకు నిధులొస్తాయనే అంశంపై యూనివర్సిటీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Mar 19 , 2025 | 12:31 AM