అశ్రునయనాల నడుమ చక్రయ్య అంత్యక్రియలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:32 AM
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య గ్రామంలో జరిగాయి.
నూతనకల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య గ్రామంలో జరిగాయి. సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నూతనకల్ మీదుగా పోలీసు బందోబస్తు మధ్య మిర్యాలకు తరలించారు. చక్రయ్యగౌడ్ గృహాంలో ప్రజల సందర్శన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన రెండో కుమార్తె తీగల సరిత తండ్రికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తిచేశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఎస్పీ కొత్తపల్లి నరసింహ గ్రామంలోనే ఉన్నారు. ఏఎస్పీ నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు,10మంది సీఐలు, 30ఎస్‌ఐలు, 400మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. అంతిమ యాత్రలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన నాగం జయసుధాసుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు మందుల భానుకిరణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, పసుల అశోక్‌యాదవ్, తొన్కునూరి సైదులు, పాల్వాయి నాగరాజు, ఉప్పుల పాపయ్య, రాచకొండ అయోధ్య, వివిద పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
హంతకులు వదిలి పెట్టేదిలేదు
మిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ మెంచు చక్రయ్యగౌడ్‌ను హత్య చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేదిలేదని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. చక్రయ్య మృతదేహాన్ని సోమవారం రాత్రి సూర్యాపేట ఏరియాఆసుపత్రిలో సందర్శించి నివాళులర్పించి,కుటుంబసభ్యులను ఓదా ర్చారు. అనంతరం మాట్లాడుతూ హత్య రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అసెంబ్లీలో ప్రస్తావన
మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ హత్య ఉదంతాన్ని ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
హంతకులకు శిక్షలు తప్పవు: ఎస్పీ నర్సింహ
దేశంలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పకుండా పడతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నర్సింహ అన్నారు. చక్రయ్య అంత్య క్రియలను మంగళవారం పర్యవేక్షించి, మాట్లాడారు. గ్రామంలో 24 గంటలు పికెంటింగ్ ఉంటుందన్నారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. హత్యకు సంబంధించి అన్నిరకాల ఆధారాలను సేకరించి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. హత్యలు బాధాకరమన్నారు. యువత నేరాలకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవన్నారు. దర్యాప్తులో వేగం, నాణ్యత పెరిగిందన్నారు. నర్సింహులగూడెం సర్పంచ హత్య కేసులో నేరస్తులు ఆరుగురికి జీవితఖైదు, మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నేరస్తులకు ఒకరికి ఉరి శిక్ష, మిగతా వారికి జీవితఖైదు పడిందని గుర్తు చేశారు. చట్టం ముందు ఎఎవరూ తప్పించుకోలేరన్నారు. నేరాలకు పాల్పడి కుటుంబాలకు దూరం కావద్దన్నారు.