Share News

బస్వాపూర్‌ నిర్వాసితులకు పరిహారం ఎన్నడో?

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:36 AM

బస్వాపూర్‌ (నృసింహసాగర్‌) రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం నిర్వాసితులు మూడున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. రిజర్వాయర్‌ కింద భూములు, ఇళ్లు కోల్పోతున్న తమకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని బాధితులు విన్నవిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్వాపూర్‌ నిర్వాసితులకు పరిహారం ఎన్నడో?

రూ.50కోట్లు విడుదలైనా పంపిణీ లేదు

మూడున్నరేళ్లుగా నిర్వాసితుల ఎదురుచూపు

నిలిచిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం

రూ.162కోట్లు విడుదల చేస్తే తప్ప పనులు చేపట్టలేని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : బస్వాపూర్‌ (నృసింహసాగర్‌) రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం నిర్వాసితులు మూడున్నరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. రిజర్వాయర్‌ కింద భూములు, ఇళ్లు కోల్పోతున్న తమకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని బాధితులు విన్నవిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 2019లో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు బీఎన్‌.తిమ్మాపూర్‌లో ని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన స్ట్రక్చర్‌ వాల్యువేషన్‌ (ఇళ్ల కొలతలు) చేపట్టాను. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్లాట్లను పంపిణీ చేయడంతో పాటు నిర్మాణానికి డబ్బు చెల్లించినా, లేఅవుట్‌లో మౌలిక వసతులు కల్పించలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు సైతం నిలిచింది. రిజర్వాయర్‌ నిర్మాణ పనులు 85శా తం పూర్తయినా, నిర్వాసితుల కు పునరావాసం పూర్తికాకపోవడంతో రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాజెక్టు పనులు సైతం రెండేళ్ల క్రితమే నిలిచిపోయాయి. ప్రభుత్వం తక్షణమే రూ. 162కోట్లు కేటాయించిన పక్షంలో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించి, నీటిని నిల్వ చేయవచ్చు.

రూ.50కోట్లు మంజూరు సరే, పంపిణీ ఏదీ?

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న బాధితులకు పరిహారం చెల్లించేందు కు ప్రభు త్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. 2024 నవంబరులో ఇరిగేషన్‌శాఖ ఈ నిధులు మంజూరు చే స్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే మొదటిగా ఇళ్లను ఖాళీ చేయించేందుకు బీఎన్‌.తిమ్మాపూర్‌ వాసులకు స్ట్రక్చర్‌ వ్యాల్యూ కింద ఈ డబ్బును చెల్లించాలని జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది. అయితే మరో రూ.50కోట్లు ప్రభుత్వం మం జూరు చేస్తే బీఎన్‌.తిమ్మాపూర్‌ వాసులకు పరిహారం పూర్తిగా చెల్లించినట్టు ఉం టుందని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులేమీ మంజూరుకాకపోగా, నవంబరులో మంజూరు చేసిన పరిహారం డబ్బును సైతం పంపిణీ చేయలేదు. గ్రామస్థులు పలుమార్లు ఎమ్మెల్యే, కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పూర్తిస్థాయి పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి ఎన్నేళ్లు నిరీక్షించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు మంజూరైతేనే పనులు...

సముద్రమట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతంగా, నదీజలాల సదుపాయం లేని కరువు నేలగా ఉన్న జిల్లాకు గోదావరి జలాల మళ్లింపునకు కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16 ప్యాకేజీల కింద గత ప్రభుత్వం పను లు ప్రారంభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణా న్ని ప్రారంభించారు. ఈ రిజర్వాయర్‌ను పూర్తి చేసి గోదావరి జలాలను మళ్లించాలన్నది ప్రణాళిక కాగా, భూసేకరణ, పరిహారం చెల్లింపులో జాప్యం కారణం గా పనులు నిలిచాయి. రిజర్వాయర్‌ను 42మీటర్ల ఎత్తు, 495 మీటర్ల వెడల్పుతో 3కి.మీ పొడవుతో నిర్మిస్తున్నారు. 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ నిర్మాణంలో ఇప్పటి వరకు 480 మీటర్ల వెడల్పుతో రిజర్వాయర్‌ కట్ట పనులు 75 శాతం పూర్తయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌ నిర్మాణానికి భూ సేకరణ కీలకంగా మారిం ది. బీఎన్‌.తిమ్మాపూర్‌లో 1,761 ఎకరాల భూ సేకరణ కు 382 ఎకరాలు, బస్వాపూర్‌లో 1,113 ఎకరాలకు 900, వడపర్తిలో 445 ఎకరాలకు 285 ఎకరాలు సేకరించారు. జంగంపల్లిలో 740 ఎకరాలకు 129 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మిగిలిన 611 ఎకరాలకు సర్వే పనులు పూర్తి చేశారు. అయితే ప్రస్తు తం రిజర్వాయర్‌లో 8టీఎంసీల సామర్ధ్యం మేర నీరు నింపేందుకు చేపట్టాల్సిన పనుల కు సైతం అవసరమైన భూ సేకరణ చేయాల్సి ఉంది. రిజర్వాయర్‌ పనులు కొనసాగించేందుకు ప్రస్తుతం రూ.162కోట్లు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో జంగంపల్లికి రూ.62కోట్లు, బీఎన్‌.తిమ్మాపూర్‌కు రూ.100కోట్ల మేర ప్రతిపాదనలు పంపారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు మంజూరు చేస్తే గానీ పనులు చేపట్టే పరిస్థితి లేదు. మరోవైపు రిజర్వాయర్‌ కోసం నోటిఫికేషన్‌ జారీచేసిన భూములకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని భువనగిరి మండలం బీఎన్‌.తిమ్మాపూర్‌, యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. భూములకు సంబంధించిన పరిహారంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాకే గ్రామాలను ఖాళీ చేస్తామని గ్రామస్థులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది.

నిధులు మంజూరు కాగానే పనులు : ఖుర్షిద్‌, ఇరిగేష్‌ శాఖ ఈఈ

బస్వాపూర్‌ వద్ద నిర్మిస్తున్న నృసింహస్వామి రిజర్వాయర్‌ పనులు ఇప్పటివరకు 85శాతం పూర్తయ్యాయి. బీఎన్‌.తిమ్మాపూర్‌ గ్రామాన్ని ఖాళీ చేయిస్తేనే నీటిని నింపాల్సి ఉంటుంది. ఈ గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం కోసం రూ.162కోట్లకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పనులను వేగవంతం చేస్తాం.

Updated Date - Apr 19 , 2025 | 12:36 AM