ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:34 AM
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పన్ను వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించాలి
కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పన్ను వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇళ్లకు సంబంధించి ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలోని వివరాలను పునఃపరిశీలించి అర్హులైన పేదలకు అందేలా కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. చేతి పంపులు, బోరు బావుల మరమ్మత్థులు చేయాలని, అవసరమైతే బోరు బావుల తవ్వకం చేపట్టాలని, అద్దె బోర్లను తీసుకోవడంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇంటి పన్నుల వసూలులో నిర్లక్ష్యం వహించవద్దని, లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎంపికైన ఇళ్లకు మార్కింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మిగిలిన లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల పరిశీలనకు సంబంధించిన నివేదికలను అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు, ఎం.శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
ఓటరు జాబితా సవరణ, బూత్‌స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,09,820, మహిళా ఓటర్లు 1,12,830, ఇతరులు ఒక్కరు ఉన్నారని, వీరి కోసం 257 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,18,297, మహిళా ఓటర్లు 1,19,931, ఇతరులు 20 మంది ఉన్నారని, వారి కోసం 309 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,60,899 ఓటర్లు ఉన్నారని వివరించారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. మృతిచెందిన వారి ఓట్ల తొలగింపునకు ఫాం-6, 7, 8లో క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, పలు పార్టీల ప్రతినిధులు కంచర్ల రామకృష్ణారెడ్డి, బట్టు రామచంద్రయ్య, ఎనబోయిన ఆంజనేయులు, శివకుమార్, బాసాని మహేందర్, తదితరులు పాల్గొన్నారు.