మోడువారుతున్న వనాలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:05 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఆలనా, పాలనా లేక చెత్తా,చెదారంతో నిండిపోయాయి.
నిర్వహణ లేక ఎండుతున్న మొక్కలు
నిధుల లేమితో అధికారుల నిర్లక్ష్యం
ఆహ్లాదం లేక వనాలకు వెళ్లని ప్రజలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఆలనా, పాలనా లేక చెత్తా,చెదారంతో నిండిపోయాయి. ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో సరైన ఏర్పాట్లు లేక లక్ష్యం నెరవేరడం లేదు. ఊరికి దూరంగా అలంకారప్రాయంగా మారాయి. చాలాచోట్ల నీళ్లు లేక చెట్లు ఎండిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-మోత్కూరు/రాజాపేట/ భువనగిరి టౌన, రూరల్ / సంస్థాననారాయణపురం / ఆత్మకూరు(ఎం)
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో 10 పంచాయతీలు ఉండగా 10 బృహత ప్రకృతివనాలు, మూడు పల్లె ప్రకృతివనాలు ఏర్పాటుచేశారు. అందులో రాగిబావి పల్లె వనానికి వెళ్లేందుకు దారిలేక నాటిన మొక్కలకు నీరు పోయక ఎండిపోయాయి. మిగతా గ్రామాల్లో మొదట్లో ఉపాధి సిబ్బంది రెండేళ్లు ప్రకృతి వనాలను పెంచి పంచాయతీలకు అప్పగించారు. ఇప్పుడు ప్రత్యేక వాచర్ లేడు. గ్రామపంచాయతీ వారే అప్పుడప్పుడు నీరు పోస్తున్నారు. ప్రకృతి వనాలకు వెళ్లి ఆహ్లాదంగా గడపడానికి అక్కడ కూర్చోవడానికి బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు లేవు. కనీసం వనభోజనాలకు వెళ్లినట్టుగా చెట్లు కింద కూర్చొని భోజనాలు చేసే పరిస్థితి లేదు. మోత్కూరులోని ప్రకృతి వనాలు నిర్వహణ సక్రమంగా లేక చెత్తాచెదారంతో నిండిపోయాయి. 8 వనాలు ఏర్పాటుచేసినా అవి ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేలా లేవు. మోత్కూరు శివసాయినగర్ వెంచర్‌లోని వనంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి.
రాజాపేట మండలకేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని వెంచర్‌లో ఏర్పాటుచేశారు. కొన్నిచెట్లను నాటినా పట్టించుకునేవారే కరువయ్యారు. నిర్వహణ చూసేవారు లేక అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
భువనగిరి పట్టణంలో రూ.25 లక్షలతో అభివృద్ధి చేసిన 8 ప్రకృతివనాల నిర్వహణ లోపబోయిష్టంగా ఉండటంతో ఉనికిని కోల్పోతున్నాయి. పలువార్డుల్లో 25కు పైగా ఖాళీ ప్రదేశాలలో ప్రకృతి వనాల పేరిట మొక్కలు నాటారు. ఒకటి, రెండు చోట్ల మొక్కలుచిగురుస్తుండగా, మిగతాచోట్ల పచ్చదనం రికార్డులకే పరిమితమైంది.సరిపడానీరు పోయకపోవడం, మొక్కల సరక్షణ లేక వనాలు బీడుభూముల్లా కనిపిస్తున్నాయి.
సంస్థాననారాయణపురం మండలకేంద్రంలోని పల్లె ప్రకృతివనం నిర్వహణ కోసం ప్రత్యేకంగా వనమాలిని నియమించారు. దీంతో మొక్కలు ఎండిపోలేదు. అయితే వనం ఊరికి చివరన ఉండటంతో ప్రజలకు పెద్దగా ఉపయోగపడడం లేదు. సేదతీరేలా సౌకర్యాలు కల్పిస్తే ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో 23పంచాయతీల్లో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. నిర్వహణను చూస్తున్న వాచర్లను తొలగించడంతో నిర్వహణ సరిగా లేక అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల వనాల్లో మొక్కలు, చెట్లు బాగానే ఉన్నాయి.
భువనగిరి మండలంలో పల్లెప్రకృతి వనాలు ఆదరణకు నోచుకోవడం లేదు. 2019 నుంచి 2024 వరకు వనసేవకులను ఏర్పాటుచేసి మొక్కల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ ఏడాది వనాల బాధ్యతలను గ్రామపంచాయతీలకు అప్పగించారు. సర్పంచల పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారులను నియమించడంతో కార్యదర్శులకు నిధులు కేటాయించకపోవడంతో వనాల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైంది. వన సేవలకులు లేకపోవడంతో మొక్కలు ఎండిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్నేళ్లు నిర్వహణ ఉండటంతో ఉసిరి, సీతాఫలం, జామ, గుల్‌మోర్, టెకోమా సీమా, తంగెడు, ఈత, కర్జూర, వేప తదితర మొక్కలు వేపుగా పెరిగి కొంతమేర పచ్చదనం కనిపిస్తోంది.
బొమ్మలరామారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం, వన సంరక్షకుడు లేకపోవడంతో చెట్ల చుట్టూ గడ్డి పెరిగింది. ప్రతిరోజూ సమీపంలోని మైసమ్మ దేవాలయానికి వచ్చే భక్తులు అక్కడే భోజనాలు చేస్తూ ఉన్నారు. మూడేళ్ల క్రితం సర్పంచ రాంపల్లి మహే్‌షగౌడ్ పంచాయతీ నిధులు రూ.1.50 లక్షలతో మొక్కలను పర్యవేక్షించారు. ఆయన పదవీకాలం ముగియడంతో వనాన్ని పట్టించుకునే వారు లేరు.
గుండాల మండలంలో ప్రకృతి వనాలు నిర్వహణ లేకపోవడంతో కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఉపాధి కూలీలతో నీటిని పోయించాలని ఆదేశాలు ఉన్నా పట్టించుకున్నవారు లేరు. గుండాల, పాచిల్లా, నూనేగూడెం, రామారం, సీతారాంపురం వనాల్లో చెట్లుఎండిపోతున్నాయి. అధికారులను వనాలను కాపాడే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో...
(ఆంధ్రజ్యోతి-మోతె/ నూతనకల్/ తిరుమలగిరి/ మేళ్లచెర్వు)
మోతె మండలంలో వనాల్లో ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. వనాల చుట్టు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్, విద్యుత తీగలు, పైపులు చోరీకి గురయ్యారు. 29 గ్రామాల్లో రూ.3 లక్షల వరకు ఖర్చు చేసి వనాలను ఏర్పాటుచేసి ఏడాదిగా వదిలేశారు. విభలాపురంలో రూ.20 లక్షలతో ఏర్పాటుచేసిన బృహత పల్లెప్రకృతి వనం బాధ్యతలను పంచాయతీకి అప్పజెప్పిన నాటి నుంచి పర్యవేక్షణ కరువైంది. దీంతో వనాన్ని ఆక్రమించుకోవడంతో పాటు తీగలు, స్తంభాలను, పైపులు చోరీకి గురవుతున్నాయి. చాలాచోట్ల వనాలు ఎండిపోయాయి.
నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఏడున్నర ఎకరాల్లో బృహత పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేశారు. రెండేళ్లు వనసేవకులను నియమించి మొక్కలను సంరక్షించారు. ప్రస్తుతం వనసేవకులు లేకపోవడంతో మొక్కలకు నీళ్లు పోసేవారు లేక చాలావరకు ఎండిపోయాయి. ప్రస్తుతం పంచాయతీ సిబ్బంది మొక్కలకు నీరు పోస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో ఏర్పాటుచేసిన నర్సరీల్లో గింజలు మొలక రాక చనిపోయాయి. గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలకు సరైన సమయంలో నీళ్లు పోయకపోవడంతో మొక్కలు చనిపోతున్నాయి.
తిరుమలగిరిలో ఏర్పాటుచేసిన నర్సరీలు అధికారుల నిర్లక్ష్యంతో కళతప్పాయి. వనసంరక్షకులు లేక మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల రక్షణకోసం ఏర్పాటుచేసిన నెట్లు చిరిగిపోయాయి. నర్సరీల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. తిరుమలగిరి పరిధిలో 2020లో ఒక్కో నర్సరీ రూ.5 లక్షల చొప్పున మూడు నర్సరీలను ఏర్పాటుచేశారు. నేడు ఆ నర్సరీలు నిరక్ష్యానికి గురై, సంరక్షకులు లేక మొక్కలు ఎండిపోయాయి.
మేళ్లచెర్వు మండలవ్యాప్తంగా పల్లె ప్రకృతి వనాల నిర్వహణను అధికారులు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. వేసవి కావడంతో వేడికి కొన్నిరకాల మొక్కలు ఎండిపోతున్నా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంలేదు. వర్షాకాలం వరకు మొక్కలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
నల్లగొండ జిల్లాలో
(ఆంధ్రజ్యోతి- కొండమల్లేపల్లి / కేతేపల్లి /
కొండమల్లేపల్లి మండలంలో 26 పంచాయతీలు ఉండగా 24చోట్ల పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. వన సంరక్షణ బాధ్యతలు చూసేవారు లేక మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న తరుణంలో పంచాయతీలకు నిధులలేమితో మొక్కల సంరక్షణ భారమైంది. చెన్నంనేనిపల్లి, ఆంబోతుతండా, గన్యనాయక్‌తండాల్లోని పల్లె ప్రకృతి వనాల్లో నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి.
కేతేపల్లి మండలకేంద్రంలోని పల్లె ప్రకృతివనం పర్యవేక్షణాలోపంతో లక్ష్యానికి ఉంది. మూడేళ్లుగా నిర్వహణ లేక నీరసించిపోతోంది. గ్రామానికి కిలోమీటరు దూరంలోని నిమ్మలమ్మ చెరువుకట్ట దిగువన వనాన్ని ఏర్పాటు చేయడంతో వనం వైపు వ్యవసాయ భూములున్న వారు మినహా సేదతీరేందుకు వెళ్లే నాథుడే లేడు. మొదటి ఏడాదిలో మొక్కల నిర్వహణ చూడగా, ప్రస్తుతం మొక్కలకు నీరు పోసే వారు లేక చనిపోయాయి. కొన్నిమొక్కలు దట్టంగా పెరిగిదారులు మూసుకుపోయాయి.
మిర్యాలగూడ మండలంలో ప్రకృతివనాలు చెత్తాచెదారులతో దర్శనమిస్తున్నాయి. కొత్తగూడెం, హట్యాతండాల్లోని ప్రకృతివనాలపై అధికారులు దృష్టిసారించకపోవడంతో రాళ్లగుట్టలు, నీళ్లు లేక వాడిపోయిన చెట్లతో అంధవిహీనంగా మారాయి. గ్రామపంచాయతీల్లో నిధుల కొరతతో వనాల సంరక్షణ భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.