Share News

నిప్పుతో చెలగాటం వద్దు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:04 AM

మండే ఎండలకు ఆపై నిప్పుతోడైతే జరిగే ప్రమాదాలు ఊహించడం కష్టం. ఇంటా, బయట నిప్పుతో వంట చేసేటప్పుడు, ఇతర సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

నిప్పుతో చెలగాటం వద్దు
అగ్నిప్రమాదాల నివారణపై జ్యోతి హస్పిటల్‌లో అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది(ఫైల్‌)

అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

మండే ఎండలకు ఆపై నిప్పుతోడైతే జరిగే ప్రమాదాలు ఊహించడం కష్టం. ఇంటా, బయట నిప్పుతో వంట చేసేటప్పుడు, ఇతర సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలకేంద్రం సమీపంలో కృష్ణానదీ తీరం వెంట అటవీభూముల సరిహద్దుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వారం కిందట మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో టిప్పర్‌ కాలిపోయింది. ఎండాకాలంలో చిన్న నిప్పురవ్వ సైతం దావానాలాన్ని సృష్టిస్తుంది. అగ్నిప్రమాదాల నివారణకు ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అధికారులు ఆర్టీసీ బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్స్‌, మల్టీప్లెక్స్‌లు కూడళ్ల వద్ద పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విరివిగా ప్రచారం చేయడమే కాకుండా వంటగ్యాస్‌ లీకేజీని ఎలా ఆపాలో ప్రత్యక్ష్యంగా చేసి చూపడం ద్వారా అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఆసుపత్రుల బిల్డింగ్స్‌లో అగ్నిమాపక పరికరాలు ఎల్లపుడూ పనిచేసేలా అందుబాటులో ఉంచుకోవాలని, చెత్తాచెదారం పోగుకాకుండా భవనాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు లిఫ్ట్‌లలో కాకుండా మెట్లమార్గాన్ని, ర్యాంప్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. పరిశ్రమలలో విద్యుత ఉపకరణాల పనితీరును తరచుగా పర్యవేక్షించాలని, చమురు గ్యాస్‌లీక్‌లను సమర్ధంగా అరికట్టాలని, ఫైర్‌డ్రిల్లును ప్రతి మూడునెలలకోసారి నిర్వహించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా తప్పించుకునే మార్గంపై పాఠశాల విద్యార్థులకు యాజమాన్యం అవగాహన కల్పించేలా చూడాలని కోరుతున్నారు. భద్రతపై అశ్రద్ధ, నిర్లక్ష్యం కూడదని హెచ్చరికలు చేస్తున్నారు. ఇళ్లలో వంట గ్యాస్‌లీక్‌ అయితే ఏంచేయాలి, అగ్నిప్రమాదం అయితే మన దగ్గర ఉన్న పరికరాలతో ఎలా ఆర్పాలి అనే విషయాలపై ప్రాక్టికల్‌గా చేసి చూపి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అగ్ని ప్రమాదాల సంఖ్య

మిర్యాలగూడ ఫైర్‌స్టేషన పరిధిలోని అడవిదేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, త్రిపురారం మండలాల్లో 2022లో 70, 2023లో 93, 2024లో 90, 2025లో ఇప్పటివరకు 27 ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా నాలుగేళ్లలో అగ్నిమాపక సిబ్బంది నాలుగు సంఘటనల్లో రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడినట్లు అధికారులు తెలిపారు.

భద్రతపై నిర్లక్ష్యం వద్దు

అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాలి. భద్రతపై నిర్లక్ష్యం పెద్దప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలను నిప్పుకు దూరంగా ఉండేలా చూడాలి. నివాస ప్రాంతాల చుట్టూ చెత్తాచెదారం లేకుండాచూడాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్‌-101కు చేసి సమాచారమివ్వాలి.

ఎస్‌. యాదగిరి, స్టేషన ఫైర్‌ ఆఫీసర్‌, మిర్యాలగూడ

Updated Date - Apr 19 , 2025 | 12:04 AM