తుర్కపల్లిలో ఆది మానవుల ఆవాసాలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:33 AM
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గుట్టలపై ఆది మానవుల ఆవాసాలు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు, జనగామ జిల్లాకు చెందిన రెడ్డి రత్నాకర్‌రెడ్డి (డిస్కవరీ మ్యాన) తెలిపారు.

చారిత్రక పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి
తుర్కపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గుట్టలపై ఆది మానవుల ఆవాసాలు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు, జనగామ జిల్లాకు చెందిన రెడ్డి రత్నాకర్‌రెడ్డి (డిస్కవరీ మ్యాన) తెలిపారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గుట్టలను పరిశీలించిన ఆయన సంబంధిత వివరాలను విలేకరులకు తెలిపారు. తుర్కపల్లి మండల కేంద్రం దట్టమైన అడవులు, అనేక లోయలతో కూడిన ప్రాంతమని, బృహత శిలా యుగం సంస్కృతికి చెందిన ఆది మానవులు ఈ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పరచుకున్నారని తెలిపారు. గుట్టలపైన విశాలమైన ఉపరితలం కలిగిన సమతుల ప్రాంతంలో బృహత శిలా యుగం నాటి నిర్మాణాలు కనిపిస్తాయని, వీటిని డాల్మెన సమాధులుగా పిలుస్తారని వివరించారు.
సమాధుల నిర్మాణం ఇలా:
గుట్టలపైన చుట్టూ రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో చిన్నచిన్న రాళ్లను ఒక దానిపై మరొకటి పేర్చి ఆ నిర్మాణంపై విశాలమైన క్యాప్ స్టోనను అమర్చి ఉంచారు. గుట్టలపై అనేక విశాలమైన సమాధులు ఉన్న ఆనవాళ్ల ప్రకారం గుట్ట దిగువన ఆది మానవులు జీవించి ఉండవచ్చునని తెలుస్తోందని తెలిపారు. ఎండ, వానల కారణంగా శిలలు శిథిలమై కూలి పోతున్నాయన్నారు. గ్రామ పరిధిలో 11వ శతాబ్దం నాటి వీరుల దేవాలయం ఉందని, ఇక్కడి వీరగల్లు శిల్పాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇవన్నీ భూమిలో కూరుకుపోయాయన్నారు. ఆది మానవులు విల్లు, ఈటె వంటి సాధనాలను వాడేవారని, పశు సంపదను కాపాడుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలిపారు. ఒక మండపం కింద పెద్ద గండ శిల పూజలందుకుంటున్న గుర్తులు ఉన్నాయని, భూమిలో కూరుకుపోయిన శిల్పాలను పైకి తీసి నిలబెడితే భవిష్యతతరాలకు గ్రామ చరిత్ర తెలుస్తుందన్నారు.