Share News

గాలి వానకు తడిసిన ధాన్యం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:16 AM

మోత్కూరు మండలంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వర్షం మండలంలోని దాచారం, పొడిచేడు, అనాజిపురం, ముశిపట్ల, దత్తప్పగూడెం తదితర గ్రామాలను అతలాకుతలం చేసింది.

గాలి వానకు తడిసిన ధాన్యం
మోత్కూరులో తడిసిన ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతు

దాచారంలో వడగళ్ల వాన

విరిగిన విద్యుత స్తంభాలు

ఇల్లు కూలి మహిళకు గాయాలు

మోత్కూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మండలంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వర్షం మండలంలోని దాచారం, పొడిచేడు, అనాజిపురం, ముశిపట్ల, దత్తప్పగూడెం తదితర గ్రామాలను అతలాకుతలం చేసింది. మోత్కూరు, పొడిచేడు, అనాజిపురం, దాచారం తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. మోత్కూరు మార్కెట్లో సోమవారం తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి, తడిసిన ధాన్యం రాశులు తిరగబోయడానికి తగిన స్థలం లేక రైతులు నానా యాతన పడ్డారు. ఈదురు గాలులకు పొడిచేడులో 27, అనాజిపురంలో 7, దాచారంలో నాలుగు, ముశిపట్ల, దత్తప్పగూడెం గ్రామల్లో రెండేసి విద్యుత స్తంభాలు విరిగిపోయాయని విద్యుత ఏఈ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం 18 స్తంబాలు కొత్తవి నాటించామన్నారు. మిగతా స్తంభాలను మంగళవారం నాటిస్తామన్నారు. దాచారం గ్రామంలో వడగళ్లు కురిశాయి. వడగళ్లతో సుమారు వంద ఎకరాల్లో కోతకు వచ్చిన వరిపంట ధ్వంసమైంది. సుమారు వంద ఎకరాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయి రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ఇట్టబోయిన నర్సయ్య మామిడి తోటలో కొన్ని చెట్లు కూకటి వేళ్లతోసహా కూలిపోయాయి. నాలుగు ఇళ్ల పై కప్పులు లేచిపోయాయి. గ్రామంలో ఒక చెట్టు విరిగి ఇంటిపై పడి ఇంటి పైకప్పు కూలి అందులో నివసిస్తున్న ముంత లక్ష్మీ మీద పడటంతో ఆమె స్వల్పంగా గాయపడింది. మామిడి, వరి తోటలు దెబ్బతిని, ఇళ్లు ధ్వంసమైన తీవ్ర నష్టం జరిగినా సోమవారం ఏ ఒక్క అధికారి ఆ గ్రామాన్ని సందర్శించలేదని గ్రామస్థులు తెలిపారు. వెంటనే అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి గాలివానకు దెబ్బతిన్న పంటలు, తోటలు, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ సర్పంచ అండెం రజితరాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

తుర్కపల్లి, రాజాపేట: తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, తిర్మలాపూర్‌, వాసాలమర్రి శివారు ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అన్నదాతలకు, మామిడి తోట యాజమానులకు మరో సారి భారీ నష్టం వాటిల్లింది. పంట చేతి కొచ్చే సమయంలో వడగళ్ల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. భారీ ఈదురు గాలులకు మామిడి తోటల్లో కాయలు పూర్తిగా రాలిపోవడంతో మామిడి తోట యాజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మండలంలోని వీరారెడ్డిపల్లి, తిర్మాలాపూర్‌, వాసాలమర్రి శివారు ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కచ్చకాయ సైజ్‌లో వడగళ్లు పడడంతో రెండు, మూడు రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడ వచ్చే పరిస్థితి లేదని మండలంలోని వీరారెడ్డిపల్లికి చెందిన రైతు తునికి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు రెండెకరాల మామిడి తోట, వడగళ్ల వర్షానికి రెండెకరాల వరి పంట నష్టం జరిగినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో ఒంటరి మహిళా నూతి శాంతమ్మ రేకులతో ఏర్పాటు చేసుకున్న ఇంటి కప్పు భారీ ఈదురు గాలులకు లేచిపోగా ఇదే గ్రామంలో ఇద్దరు గ్రామాస్థుల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గ్రామస్థులు తెలిపారు. వీరారెడ్డి పల్లి పీఎసీఏస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం రాశులులు వర్షానికి తడిసినట్లు గ్రామస్తులు, రైతులు తెలిపారు. ఈదురు గాలులకు చెట్లు విరిగిపోయాయి. రాజాపేట మండలం మోల్లాగూడెంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వరి, మామిడి పంటకు నష్టం వాటిల్లింది.

Updated Date - Apr 22 , 2025 | 12:16 AM