Share News

బిర్యానీ సెంటర్‌లో భారీ పేలుడు

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:52 PM

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ బిర్యానీ సెంటర్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది.

బిర్యానీ సెంటర్‌లో భారీ పేలుడు
పేలుడు ధాటికి చెల్లాచెదురుగా హైదరాబాద్‌ రోడ్డుపై పడిన హోటల్‌ సామగ్రి, హోటల్‌లో చెలరేగిన మంటలు

పేలుడుధాటికి చెల్లాచెదురై రోడ్డుపై పడిన సామాన్లు

నల్లగొండ క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ బిర్యానీ సెంటర్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి బిర్యానీ సెంటర్‌ షట్టర్‌, గేటు సహా లోపల సామాన్లు అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. నల్లగొండ టూ టౌన ఎస్‌ఐ ఎర్ర సైదులు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంజాన మాసం ప్రారంభం కావడంతో నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో పూజిత అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న హాట్‌ బకెట్‌ బిర్యానీ సెంటర్‌లో సోమవారం అర్థరాత్రి వరకూ తెరిచే ఉంది. సుమారు ఒంటి గంట తర్వాత సెంటర్‌ మూసివేసిన 15 నిమిషాల అనంతరం బిర్యానీ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి హోటల్‌ సామగ్రి మొత్తం రోడ్డుపైన పడటంతో స్థానికులు గమనించి పోలీసులకు, ఫైర్‌స్టేషనకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్‌స్టేషన అధికారులు మంటలను ఆర్పారు.

పేలుడుపై సందిగ్ధం

హాట్‌బకెట్‌ బిర్యానీ సెంటర్‌లో పేలుడు ఘటనపై నిర్ధారణకు రాలేకపోతున్నారు. బిర్యానీ సెంటర్‌లో గ్యాస్‌సిలిండర్‌ ఏవీ పేలలేదని, ఒక వేళ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదేసమయంలో పేలుడులో మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. బిర్యానీ సెంటర్‌ నిర్వాహకుడు బబ్లూ ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:52 PM