ఉద్యమాలే మాకు ఉగ్గుపాలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:34 AM
అమ్మకు పిల్లలే మొదటి ప్రాధాన్యం. వారి ఆలనాపాలనలోనే పెరుగుతారు. కానీ మా అమ్మకు సమాజంలోని ప్రతీ వర్గం సమానం. వారి కష్టాలను తీర్చడమే ఆమె లక్ష్యంగా పనిచేసేవారు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
అమ్మకు పిల్లలే మొదటి ప్రాధాన్యం. వారి ఆలనాపాలనలోనే పెరుగుతారు. కానీ మా అమ్మకు సమాజంలోని ప్రతీ వర్గం సమానం. వారి కష్టాలను తీర్చడమే ఆమె లక్ష్యంగా పనిచేసేవారు. నాన్న జైల్లో ఉండగా కూడా ఆమె మమ్మల్ని వదిలి ఉద్యమాల బాట పట్టేవారు. ఊర్లో వారు మమ్మల్ని చూసుకునేవారు. తెలియకుండా ఆమె మాకు ఉగ్గుపాలతోనే ఉద్యమాలను నేర్పింది, కష్టాలను, ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకున్నవే. కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ.. ఆమెను చూసే మేము రాటుదేలామంటుంటున్నారు కమ్యూనిస్టు నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం వారసులు. నేడు స్వరాజ్యం మూడో వర్ధంతి సందర్భంగా ఆమెతో అనుబంధాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
కమ్యూనిస్టు దారిలో ఆమే స్ఫూర్తి
అమ్మ ఆయుధం పట్టి రజాకార్లకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం నడిపినట్టే వ్యవసాయం అంతే శ్రద్ధతో చేసేది. తుపాకిని గురిపెట్టి శత్రు శిబిరంపై దాడి చేయడంలో వ్యూహాలు పన్నినట్టే క్షేత్రంలో విత్తనాలు నాటి పంట దిగుబడి వచ్చేవరకు మహిళా రైతుగా ఎంతో శ్రమతో సాగు చేసేది. ఆమె స్ఫూర్తితోనే నేటికీ కమ్యూనిస్టు బాటలో నడుస్తున్నమంటున్నారు మల్లు స్వరాజ్యం పెద్దకుమారుడు మల్లు గౌతంరెడ్డి. అమ్మతో ఆయన అనుబంధం ఆయన మాటల్లోనే...
నాకు ఊహ తెలిసే నాటికి 1953-54లో సూర్యాపేట పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాయినిపాలెంలో గుడిసెలోనే మా నివాసం. ఆ ప్రాంతానికి మూసీ ప్రాజెక్టు ద్వారా సాగునీటి అవకాశం ఉండటంతో కర్విరాలకొత్తగూడెంలో అమ్మమ్మ చొక్కమ్మ ఇచ్చిన ఆస్థిని విక్రయించి రాయినిపాలెంలో భూమి కొనుగోలు చేశారు. 1962లో భారత, చైనా యుద్ధం సమయంలో దేశంలో కమ్యూనిస్టులను అరెస్ట్ చేస్తుండటంతో నాన్న మల్లు వెంకటనర్సింహారెడ్డి అజ్జాతంలోకి వెళ్లారు. అమ్మ వ్యవసాయ కూలీలతో కలిసి పొలం పనులకు వెళ్లేది. రాత్రి సమయాల్లో నీటి కోసం గస్తీ కాసేది. పోలీసులు ఇంటిపై దాడి చేసి పశువులు ఎత్తుకపోకుండా పక్కవారి కొట్టాల్లో కట్టేసేది. పంట రాశులు దోచకుండా ఇతరుల కళ్లాల్లో పోసి గడ్డితో కప్సేఏది. నిద్రాహారాలు మాని రాతిక్రి రాత్రే ఈ పనులన్నీ తోటివారి సహకారంతో చేసేది. ఆమెను చూసి ఏ పనినైనా దీక్షతో చేయాలని చూసి నేర్చుకున్నాం.
కథలు కథలుగా చెప్పేవారు
తెలంగాణ ఉద్యమంలో గెరిల్లా శిక్షణ తీసుకుని అనేక సమస్యలను ఆమె ఎదుర్కొన్న తీరు, శత్రువుల కళ్లుకప్పి తప్పుకున్న ఘటనలు, తమ వారిని రక్షించుకునేందుకు పన్నిన మిలిటరీ వ్యూహాల గురించి మా ఇంటికి వచ్చే పార్టీ సీనియర్ నేతలు చెబుతుంటే వినేవాళ్లం. అజ్జాతంలో ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి పడిపోతే ఆమెను వెంట తీసుకపోలేక మిగతా దళసభ్యులు వదిలేసి వెళితే రెండు రోజులకు కోలుకుని తిరిగి వచ్చినట్లు చెబుతుండేవారు. మరో సందర్భంలో స్వరాజ్యం ఓ ఇంటిలో ఉందని రజాకార్ల సేనలు ఊరును చట్టుముడితే గౌడ ఇంటిలో తలదాచుకున్న అమ్మను ఇంటి ఇల్లాలు కల్లుకుండ నెత్తినపెట్టి కొత్త కోడలుగా పోలీసులకు చెప్పి ఊరు దాటించిందట. ఉద్యమంలో నాయకురాలిగా వ్యవసాయంలో కూలీగా పనిచేసిన అమ్మ నన్ను, నా తోబుట్టువులను అంతే ఆప్యాయంగా చూసుకున్నారు. అమ్మ, నాన్న కుటుంబంతో కలిసి లేనప్పుడు ఊరంతా అమ్మానాన్నలై మమ్ములను ఆదుకున్నరు. అమ్మ మరణించేనాటికి ఆలిండియా మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు.
అమ్మ పోరాటం, మానవత్వం
పోరాటం, మానవత్వం, కష్టపడే తత్వం అమ్మ నాకు నేర్పినబాట. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొవాలనే మనోధైర్యాన్ని కల్పించింది. అమ్మ ఉద్యమంలో పనిచేస్తుండగా అనేకమార్లు పోలీసులు, భూస్వాముల నిర్బంధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అజ్జాత జీవితంలోనూ, తిరిగి బహిరంగ ఉద్యమాల్లో పాల్గొంటూ అన్ని సమయాల్లోనూ తను చేయాల్సిన పనిపై తప్ప ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించేది కాదు. అమ్మ పోరాటంలో ఉంటే ఊరు జనమంతా మాకు చుట్టాలై ఆదరించేవారు. తీవ్ర నిర్భంద సమయాల్లో మా టీచర్స్ కూడా మమ్ముల్ని వారింటిలోనే ఉంచుకుని స్కూల్‌కు తీసుకవెళ్లేవారు. మా కోసమే మీ తల్లిదండ్రులు పోరాడుతున్నారని పేద వర్గాల ప్రజలు మా ఆలనాపాలనా చూసేవారు. ప్రజల కోసం పనిచేసే నాయకులంటే నాడు ప్రజలకు అంత ప్రేమవుండేది. నేటి నాయకులపై ప్రజల్లో అభిమానం కొరవడుతోంది. నాడు పోలీసులు ఊరిమీదకు వచ్చారంటే ఊరంతా ఏకతాటిపైకి వచ్చేది. శిస్తు పేరుతో జప్ప్తులకు వస్తే ప్రజలంతా ఏకమై ఎదురుతిరిగేవారు. చిన్న పిల్లలమైన మేము ఆ పరిస్థితులతో రాటుదేలాం. నాకు పెళ్లైయే నాటికి అమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అమ్మ మరణించేంత వరకు ఉద్యమాలతోనే నడిచింది. రైతు, కార్మిక, మహిళా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహింయింది. ఉద్యమంలోనూ ఎందరికో తల్లిగా సేవలందించింది. తోటి వారికి సహాయ సహకారాలు అందించడానికి అమ్మే స్ఫూర్తి
పాదూరి కరుణ, మల్లు స్వరాజ్యం కుమార్తె
అత్త కాదు..అమ్మే
ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: కోడలు మల్లు లక్ష్మి
(ఆంధ్రజ్యోతి-భానుపురి)
మల్లు స్వరాజ్యం నాకు అత్త అయినా అమ్మలాగే చూసుకుంది. ఆమె తన ముగ్గురి పిల్లలతో పాటు నన్ను బాగా చూసుకున్నారు. 1988లో ఆమె కుమారుడు నాగార్జునరెడ్డితో హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి మావద్ద ఆమె ఉంటోంది. అత్తలా కాకుండా అమ్మతో ఉన్న అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది.
రాయినిగూడెం, నల్లగొండ, హైదరాబాద్‌లలో కలిసి 35ఏళ్లుగా కలిసి ఉన్నాం. ఆమె ధైర్యం, గంభీరత్వంతో భయపడేదాన్ని. పెళ్లి చేసుకున్న తర్వాత అమాయకంగా ఉండేదాణ్ణి. 2006లో గ్రామ సర్పంచగా ఎన్నికైనప్పుడు ‘అమ్మ’ నవల చదవమని ఇచ్చారు. అదేవిధంగా పేపర్లలో వచ్చే ఎడిటోరియల్స్ చదవాలని చెప్పేది. అవి చదివితే దేశ రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోందని చెప్పేవారు. ఇంటర్ వరకే చదువుకున్న నన్ను లైబ్రరీసైన్స కోర్సులో చేర్పించింది. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఆమెకు వచ్చే తెలంగాణ స్వాంతంత్రసమరయోధురాలు పెన్షనతో నన్ను చదివించింది. పాత ఎమ్మెల్యే కోర్టర్స్‌లో ఉండి చదువుకున్నా.
ఉద్యోగం చేయాలని వారి కోరిక
నేను ఉద్యోగం చేయాలని ఆమె కోరిక. టైప్ లోయర్, హైయర్ నేర్పించారు. కోర్టులో జాబ్ కోసం ప్రయత్నించినా రాలేదు. మామ డిగ్రీ పూర్తి చేసి లా చేయాలని చెప్పారు. జనాలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పడంతో లా పూర్తి చేశా. నా భర్త నాగార్జునరెడ్డి రాజకీయాల్లో ఉండడం, నేను ఉద్యోగం చేస్తే కుటుంబానికి ఆసరగా ఉంటామని అత్తా, మామల కోరుకునేవారు. లా పట్టా పొందినప్పుడు, టైప్ లోయర్, హైయర్ పూర్తి చేసినప్పుడు మల్లు స్వరాజ్యం చాలా సంతోషపడింది.
ఆమె ధైర్యం, గంభీరత్వం మాకు స్ఫూర్తి
రాజకీయ కుటుంబం నుంచి రాకున్నా అత్తా,మామల ఇంటికి వచ్చిన తర్వాతే రాజకీయ ప్రభావం నాపై పడింది. దీనికి తోడు మల్లు నాగార్జునరెడ్డి ప్రొత్సహించేవారు. ఇంట్లో కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేదాణ్ణి. వృధా ఖర్చులు చేయవద్దని అత్తమ్మ చెప్పేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం పని చేయాలని తపన ఉండాలని చెప్పేవారు. ఆమె ధైర్యం, గంభీరత్వమే మాకు స్ఫూర్తిగా నిలిచింది. వృద్ధాప్యం వచ్చినా పుస్తకాలు చదివేవారు. బయటి నుంచి పుస్తకాలు తెమ్మనిచెప్పేవారు. నాకు ఆమె స్నేహితురాలిగా, రాజకీయనాయకురాలిగా గంభీరత్వంతో ఉండేది. మామామ వెంటనర్సింహారెడ్డి కూడా చాలామంచిగా ఉండేవారు. 12 ఏళ్లు యన బాగోగులు చూడా. మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే అక్కడ సపర్యాలు చేశా. చనిపోయిన తర్వాత తన దేహం సైతం ఉపయోగపడాలని చెప్పడంతో నల్లగొండలోని మెడికల్ కళాశాలకు పార్థివదేహాన్ని ఇచ్చేశాం.