Share News

సత్వర న్యాయంకోసం నూతన కోర్టులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:49 PM

రాష్ట్రంలోని కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్‌ రాధారాణి అన్నారు.

సత్వర న్యాయంకోసం నూతన కోర్టులు
కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయాధికారి శ్యామ్‌శ్రీ, పక్కన కలెక్టర్‌, ఎస్పీ

హుజూర్‌నగర్‌ , ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్‌ రాధారాణి అన్నారు. హుజూర్‌నగర్‌ పట్టణానికి మంజూరైన అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును గురువారం హైకోర్టు న్యాయమూర్తులు వినోద్‌కుమార్‌, లక్ష్మణ్‌, సృజనలతో కలిసి వర్చూవల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పెండింగ్‌ కేసులు అత్యధికంగా ఉండగా వాటిని సత్వరమే పరిష్కరించేందుకు నూతన కోర్టు మంజూరు చేసినట్లు తెలిపారు. బార్‌ అసోసియేషన అధ్యక్షుడు సాముల రామిరెడ్డి సూచన మేరకు నూతన కోర్టు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కోర్టును ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నూతన కోర్టును ప్రారంభిస్తేనే జడ్జిని కేటాయించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అనేక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు కృషి చేస్తున్నారని తెలిపారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం కూడా ఎంతో కీలకమన్నారు.

నెరవేరిన న్యాయవాదుల కోరిక

హుజూర్‌నగర్‌ ప్రాంత న్యాయవాదుల చిరకాలవాంఛ నూతన కోర్టు ప్రారంభంతో నెరవేరినట్లు భావిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ అన్నారు. అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు 3,067 కేసులు కేటాయించినట్లు తెలిపారు. పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని సివిల్‌ కేసులు మొత్తం ఈ కోర్టుకు కేటాయించామన్నారు. న్యాయమూర్తుల ఎంపిక కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులలో అనుకున్న స్థాయిలో న్యాయమూర్తులుగా ఎంపిక కాకపోవడం మూలంగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామన్నారు. న్యాయవాదులు పోటీ పరీక్షల్లో పాల్గొని కష్టపడి చదివి న్యాయమూర్తులుగా ఎంపికైతే న్యాయమూర్తుల కొరత తీరుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల కొరత ఉందన్నారు. త్వరలోనే నూతన కోర్టుకు పూర్తిస్థాయి జడ్జిని నియమిస్తామన్నారు.

ఆశ్చర్యానికి గురయ్యాం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా ఒక్క హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలోనే 8,500 కేసులు పెండింగ్‌లో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని హైకోర్టు న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ సృజన అన్నారు. పెండింగ్‌ కేసుల భారాన్ని పరిగణలోకి తీసుకుని బార్‌ అసోసియేషన్‌ విన్నపం మేరకు నూతన కోర్టును మంజూరు చేశామన్నారు. కాగా పట్టణంలోని నూతన కోర్టును జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్యామ్‌శ్రీ, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయాధికారి శ్యామ్‌శ్రీని న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జిలు జిట్టా శ్యాంకుమార్‌, సురేష్‌, పర్విన్‌కౌసర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి భవ్యశ్రీ, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, న్యాయవాదులు కాలువ శ్రీనివాసరావు, నట్టె సత్యనారాయణ, అంబటి శ్రీనివా్‌సరెడ్డి, నారపరాజు శ్రీనివాసరావు, బాలకృష్ణ, కృష్ణయ్య, రేణుకదేవి, రవికుమార్‌, సుందర్‌, రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:49 PM