Share News

ప్రయాణికుల దాహం తీర్చరూ

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:01 AM

జిల్లా కేంద్రమైన నల్లగొండ బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రయాణికుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంటోంది.

ప్రయాణికుల దాహం తీర్చరూ
నల్లగొండలో వ్యర్థపదార్థాలతో మంచినీటి కుళాయి

నల్లగొండ బస్టాండ్‌లో తాగునీటికి తిప్పలు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)

జిల్లా కేంద్రమైన నల్లగొండ బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రయాణికుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంటోంది. ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి చెందిన బస్సు సర్వీసులు కూడా హైదరాబాద్‌కు ఈ బస్టా ండ్‌ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీససౌకర్యాలు కరువయ్యాయి. వేసవి తీవ్రతతో ప్రయాణికులు దాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు మంచినీటి నల్లాలు ఉండగా ఒకటి పూర్తిగా బంద్‌ కాగా మరొకటి చాలీచాలని నీటిని అందిస్తోంది. ఆ నల్లా నుంచి వచ్చే నీరు పరిశుభ్రంగా లేకపోవడంతో తాగేందుకు ప్రయాణికులు ఇష్టపడం లేదు. దీంతో దుకాణాల వద్ద రూ.10ల వరకు ఎక్కువ ధరకు మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. అయితే బస్టాండ్‌ బయట చలివేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు

అక్కడే మంచినీరు తాగుతూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. తాగునీటి ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

సమన్వయ లోపం.. ప్రయాణికులకు శాపం

(ఆంధ్రజ్యోతి-కోదాడ రూరల్‌)

సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్‌లో ప్రయాణికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై రోజుకు 500 పైగా బస్సు సర్వీసులు ఈ బస్టాండ్‌కు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో రద్దీ మరింత పెరిగింది. అందుకు అనుగుణంగా బస్టాండ్‌లో సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కనీసం మూత్రశాలలు లేక ప్రయాణికులు ఆవరణను వినియోగిస్తున్నారు. సుమారు రూ.5లక్షలతో బస్టాండ్‌లో కోదాడ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. వీటి నిర్వహణలో మునిసిపల్‌ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు డీఎం కార్యాలయం పక్కన ఉండడంతో తప్పని పరిస్థితిలో మహిళలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో బస్టాండ్‌లో ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నారు. శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం, వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ఫ్రిజ్‌ను ఏర్పాటుచేశారు. దీంతో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండాపోయింది.

సూర్యాపేటలో సరిపడా అందని నీరు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేటఅర్బన)

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మంచినీటి కటకటతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కొత్తబస్టాండ్‌లో ఒక్కటే వాటర్‌ ఫ్రిజ్‌ ఉంది. ప్రతి రోజూ 90 నుంచి 110 లీటర్ల మంచినీరు అవసరం కాగా 70 లీటర్ల వరకు అందిస్తున్నారు. అదేవిధంగా హైటెక్‌ బస్టాండ్‌లో ఫ్రిజ్‌ ఉండగా ప్రతి రోజూ 90 లీటర్ల మంచినీరు అవసరం కాగా 50 లీటర్ల నీరు మాత్రమే అందిస్తోంది. దీంతో మంచినీటి కోసం ప్రయాణికులు తప్పనిసరిగా అక్కడి దుకాణాల్లో మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు.

మిర్యాలగూడలో నీటిసౌకర్యం

(ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన)

ప్రయాణికుల తాగునీటి ఇబ్బందులు తీర్చడంలో మిర్యాలగూడ ఆర్టీసీ అధికారులు ముందంజలో ఉన్నారు. వాటర్‌కూలర్‌ ఏర్పాటుచేసి దాహార్తి తీరుస్తున్నారు. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థ దశాబ్దకాలంగా బస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటుచేస్తోంది. అదేవిధంగా వాసవీ, లయన్సక్లబ్‌ల ఆధ్వర్యంలో ఆడపాదడపా చల్లటి నీరు, పెరుగన్నం అందిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి రోజూ సుమారుగా 45వేల మంది ప్రయాణికులు గమ్యస్ధానాలకు చేరుకుంటుంటారు. మూత్రశాలలు, హ్యాండ్‌వాష్‌ ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:01 AM