అస్తవ్యస్తంగా పారిశుధ్యం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:22 AM
చండూరు మునిసిపాలిటీలో పారిశుఽధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోజుల తరబడి మురుగు నీటికాల్వలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతుండడంతో దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. - (ఆంధ్రజ్యోతి-చండూరు)
పట్టణంలో ప్రధానచౌరస్తా గుండ్రపల్లి ఎక్స్‌రోడ్డు వద్దనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. విద్యార్థులు చదవుకునే గదుల పక్కనే మురుగు కా ల్వ పారుతోంది. పట్టణంలో రోడ్డు విస్తరణ చేపట్టిన క్రమంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీం తో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు బయటికి వదిలేయడంతో వ్యర్థాలు పేరుకుపోయాయి.రోజుల తరబడి వ్యర్ధాలను తొలగించకపోవడంతో పరిసరాలు అంతా దుర్ఘంధంగా మారింది. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అటువైపు వెళ్లలేక ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యర్థాలు తొలగించి శుభ్రం చేయాల్సిన అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. మునిసిపల్ అధికారులు స్పందించి పట్టణం లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి పారిశుధ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతుల్లో ఫాగింగ్ యంత్రాలు
మునిసిపాలిటీలో ఫాగింగ్ యంత్రాలు రెండు ఉండగా, ఒకటి కొంత కాలంగా మరమ్మతులు చేయకపోవడంతో వృఽథాగా పడి ఉంది. మరొకటి కూడా పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో కొన్ని నెలల క్రితం అడపాదడఫా మాత్రమే కొన్ని వార్డుల్లో ఫా గింగ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
కలెక్టర్ ఆదేశించినా మారని తీరు
మార్చి 2న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు మునిసిపాలిటీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు, బాలికల హాస్టల్ పరిసరాల్లో దోమలు అధికంగా ఉన్నాయని గమనించి, అనవసరమైన మొక్కలు తొలగించి ఫాగింగ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించినప్పటికీ, ఒక్కరోజు మాత్రమే ఫా గింగ్ చేశారని మరోసారి చేయమని అడిగితే పట్టించుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. కలెక్టర్ పర్యటన ముగిసి నెల రోజులు గడిచినప్పటికీ అధికారులు ఆమె ఆదేశాలు పట్టించుకోవడం లేదని ప్రజ లు ఆరోపిస్తున్నారు.
ముక్కులు మూసుకోవాల్సి వస్తోంది
గుండ్రపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వ్యర్థాలతో ఈ ప్రాంతమంతా దుర్ఘంధం వస్తుంది. దుర్వాసనతో పని చేసుకోలేకపోతున్నాం. మునిసిపాలిటీ సిబ్బంది, అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలి. రాత్రి సమయాల్లో దోమల బెడద చాలా ఎక్కువైంది. కొన్ని నెలలుగా దోమల మందు కూడా కొట్టడం లేదు.
- ఇరిగి రామకృష్ణ, 4వ వార్డు,
దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
దోమల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి దోమ లు వృద్ది చెందకుండా చూడాలి. విష జ్వరాలు ప్రబ లే అవకాశం ఉంది. అన్ని వార్డుల్లో వెంటనే ఫాగింగ్ చేయాలి.
- రుద్ర రామలింగం, 5వ వార్డు, స్థానికుడు
సిబ్బందితో శుభ్రం చేయిస్తాం
పట్టణంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తమ సిబ్బందితో తొలగిస్తాం. నాలాల వద్ద వ్యర్ధాలు పేరుకోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. పట్టణంలో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపిస్తాం. ఎ క్కడైనా వ్యర్ధాలు నిల్వ ఉంటే ఆ కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.
- పుష్పలత, మునిసిపల్ కమిషనర్, చండూరు