సాగుకు సాంకేతిక ఊతం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:23 AM
వ్యవసాయరంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. పంటలు సాగుపై ఇప్పటికే ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.దీనికి తోడు రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంక్షేమ పథకాలు,విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, తదితర అంశాలను సులభతరం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
ఆధార్‌కార్డు మాదిరిగానే రైతులకు భూధార్‌కార్డు
14 అంకెలతో యూనిక్ కోడ్
భూయజమాన్య హక్కులపై పారదర్శకత
జిల్లాలో 2.81లక్షల మంది రైతుల వివరాల నమోదుకు సన్నాహాలు
వ్యవసాయశాఖ అధికారులకు శిక్షణ తరగతులు
వారంలో క్షేత్రస్థాయికి ఏఈవోలు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వ్యవసాయరంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. పంటలు సాగుపై ఇప్పటికే ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.దీనికి తోడు రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంక్షేమ పథకాలు,విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, తదితర అంశాలను సులభతరం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆధార్ కార్డు మాదిరిగా రైతుల కు భూధార్ కార్డులతో గుర్తింపు ఇవ్వనున్నారు. అన్నదాతకు సం బంధించిన భూ కమతానికి 14 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్) కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భూదార్ కార్డు జారీ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూనిక్‌కోడ్‌ను ప్రతిష్ఠాత్మకం గా భావించాలని, రైతులకు సంబంధించిన సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నూ వ్యవసాయశాఖ పరిధిలోని డివిజన్, మండల ఎఈవోలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి, వారికి యూనిక్ కార్డు నమోదుకు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించనున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో యూనిక్‌కోడ్ నమోదు పై సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరించారు. అన్ని డివిజన్లలో సం బంధిత అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 17 మండలాల్లో 91 క్లస్టర్లలో రైతు వేదికలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వీటిలో సుమారు 2.50లక్షల ఎకరాల్లో వరి, 65వేల ఎకరాల్లో పత్తి, 1.40లక్షల ఎకరాల్లో కందులు, పప్పు ధాన్యాలు, ఇతర పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 2.81లక్షల మంది రైతులు ఉన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో చాలా వరకు డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉన్నాయి. పలు భూములకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో భూములు ఉన్న ప్రతీ రైతు వద్దకు వెళ్లి పట్టాదారు పుస్తకాల ఆధారంగా సర్వే నిర్వహించి, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ వారంలో యూనిక్‌కోడ్‌కు సంబంధించిన శిక్షణలు పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది.
భూముల వివరాలు ఫార్మర్ రిజిస్ట్రీలో
రైతులకు సంబంధించిన భూకమతాలకు గుర్తింపు సంఖ్య కేటాయించడంతో ఎంత మేర భూమి ఉందో లెక్క తేలుతుంది. భూయాజమాన్య హక్కుల గుర్తింపు, భూ వివాదాలను నివారించి పారదర్శకత పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. భూముల వివరాలను కూడా సులభంగా భద్రపరిచేందుకు వీలుంటుంది. ప్రతీ రైతుకు సంబంధించిన భూముల వివరాలు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదవుతాయి. తద్వారా భూ యజమాని, విస్తీర్ణం, తదితర వివరాలు గుర్తించేందుకు ఉపయోగపడనుంది. ఈ సంఖ్య కేటాయించడంతో భూమి సాగుకు యోగ్యంగా ఉందా? గుట్టలు, రాళ్లు ఉన్నాయా? నిర్ధారించడంతో పాటు ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నివారించేందుకు దోహదపడుతుంది. రైతులకు విశిష్ట సంఖ్య కేటాయించడంతో బ్యాంకింగ్, బీమా, తదితర వ్యవస్థలకు సులభంగా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది.
అనుసంధానం ఇలా..
రైతు విశిష్ట సంఖ్యను పొందేందుకు ఆధార్‌కార్డుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్‌నెంబరు, భూపట్టాదారు పాస్‌పుస్తకం ఏఈవోలకు అందించాలి. వీటి ఆధారంగా ఏఈవోలు రైతులకు గుర్తింపు సంఖ్యలు కేటాయిస్తారు. రాష్ట్ర పథకాలు రైతు భరోసా, రుణమాఫీ, తదితర వాటితో ఈ గుర్తింపు సంఖ్యకు ఎలాంటి సంబంధం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ పథకాలకు మాత్రమే దీన్ని ప్రామాణికంగా తీసుకోనున్నట్టు సమాచారం.
రైతులందరీ వివరాలు నమోదు: గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రైతుల అందరి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మేరకు జిల్లాలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాం. డివిజన్ స్థాయిల్లో ఆన్‌లైన్‌లో నమోదుపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నాం. రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏఈవోలతో ఆన్‌లైన్ నమోదు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సర్వే వివరాల సమాచారం కూడా రైతులకు సంబంధించిన మొబైల్ ఫోన్లకు అందుతుంది.