డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:12 AM
సమాజానికి సవాలుగా మారుతున్న మాదక ద్రవ్యాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ అన్నారు.

బాధితులకు అండగా ఉంటాం
స్వీయ నియంత్రణతో సైబర్ నేరాలకు చెక్
సెటిల్‌మెంట్స్ చేసే పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు
డీసీపీ అక్షాంశ్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్) : సమాజానికి సవాలుగా మారుతున్న మాదక ద్రవ్యాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. ప్రజల్లో పోలీసులపై మరింత విశ్వసనీతయ పెంచేలా పని చేస్తానని, విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చిత్తశుద్ధితో శ్రమిస్తే లక్ష్యం సాధించవచ్చని పేర్కొన్నారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..
మాదక ద్రవ్యాలు సమాజానికి సవాలుగా మారుతున్నాయి. ముఖ్యం గా యువత లక్ష్యంగా విక్రయాలు సాగుతుండడం ప్రమాదకరం. జిల్లా పరిధిలో గంజాయి సహా అన్ని రకాల డ్రగ్స్ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెడతాం. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే మాద క ద్రవ్యాల వినియోగంతో తలెత్తే అనర్థాలపై విద్యాసంస్థల్లో, యువతకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తాం. శాంతి భద్రతలను కాపాడేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచు తాం. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరి స్తాం. రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారికి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, నాయకులు మద్దుతు ఇవ్వకూడదని, వారికి అనుకూలంగా పోలీసులకు సిఫార్సు కూడా చేయవద్దని కోరుతున్నా.
క్రిమినల్స్‌కు చెక్
జిల్లాలో నేరాలకు పాల్పడే వారందరికీ త్వరలోనే చెక్ పెడతాం. నేరం ఎలాంటిదైనా, చేసింది ఎవ్వరైనా సరే ఊచలు లెక్కపెట్టిస్తాం. మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినా, అక్రమ రవాణాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు. దొంగతనాల నివారణకు జిల్లా అంతటా పెట్రోలింగ్ పెంచుతాం. సీసీ కెమెరాల బిగింపునకు దాతలు, వ్యాపారులు శ్రద్ధ చూపాలి. పాత కెమెరాలకు మరమ్మతులు చేయిస్తున్నాం. పండుగలను అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా నిర్వహించాలి. ఇతర ప్రాంతాల్లో జరిగే ఘటనలు జిల్లాపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రజలు కూడా వదంతులను నమ్మవద్దు. అనుమానాస్పద ఘటనలు, వ్యక్తులపై స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి.
స్వీయ నియంత్రణతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట
సైబర్ నేరాల్లో మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బాధితులకు న్యాయం జరిగేలా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే స్వీయ నియంత్రణ, అవగాహనతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. గుర్తుతెలియని నెంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌కు ఓటీపీ, బ్యాంకు తదితర వ్యక్తిగత వివరాలను చెప్పవద్దు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయవద్దు. అపరిచిత ఫ్రెండ్‌షిప్ రిక్వెస్టులను కన్‌ఫామ్ చేయవద్దు. న్యూడ్ తదితర అశ్లీల వీడియో కాల్స్ ను అటెండ్ చేయవద్దు. భారీ డిస్కౌంట్, అధిక లాభాల ఆఫర్లను అంగీకరించవద్దు, పెట్టుబడులు పెట్టవద్దు. క్రికెట్ బెట్టింగులతో మోసపోవద్దు. బెట్టింగులతో పలు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ తరహా నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. మోసపోయిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
వలస కార్మికుల డేటా బేస్
ఉపాధి నిమిత్తం జిల్లాకు వస్తున్న అంతర్రాష్ట్ర వలస కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వలస కార్మికులతోనే చోరీలు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని పలువురి అభిప్రాయం. దీంతో ఉపాధి నిమిత్తం జిల్లాకు వస్తున్న వలస కార్మికుల డేటా బేస్ రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. జిల్లాకు వస్తున్న ప్రతీ వలస కార్మికుడి వివరాలను పోలీ్‌సస్టేషన్ల వారీగా సేకరిస్తాం. ఏ రాష్ట్ర నుంచి ఎంత మంది వచ్చారు? ఎక్కడ ఉంటున్నారు? రోజువారి పనేంటి? తదితర వివరాలను, వారి ఆధార్ కార్డులను సేకరిస్తున్నాం. పనుల కోసం వలస కార్మికులను రప్పిస్తున్న కాంట్రాక్టర్లు, సంస్థలు కూడా వారి పూర్తి వివరాలు సేకరించాలి. జిల్లాలోని రెండు జాతీయ రహదారులు, రెండు రైల్వే మార్గాల్లో నిఘా పెంచుతాం. డ్రంకైన్ డ్రైవ్, వాహనాల తనిఖీని మరింత ముమ్మరం చేస్తాం.
సెటిల్మెంట్స్‌కు పాల్పడితే చర్యలు
న్యాయం కోసం బాధితులు ఇచ్చే ప్రతీ ఫిర్యాదుపై ఆయా పోలీ్‌సస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ చేయాల్సిందే. పోలీసులు బాధితుల పక్షానే ఉండాలి. స్టేషన్‌కు వచ్చే బాధితులను ఆదరించి గౌరవించాలి. సివిల్స్, ఇతర కేసుల్లో సెటిల్మెంట్స్‌కు పాల్పడే పోలీసు అధికారులకు, సిబ్బందిపై శాఖాపర చర్యలు తీసుకుంటాం. సివిల్ కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, నిబంధనలు పాటించాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వవద్దు. క్షేత్రస్థాయిలో, విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై పోలీస్ సిబ్బంది నేరుగా తనను కలవవచ్చు. బాధితులు కూడా న్యాయం జరగకుంటే తన దృష్టికి తీసుకురావాలి. పెండింగ్ కేసులు, చార్జిషీట్లు, ఎన్‌బీడబ్ల్యూపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరిస్తాం.
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్య సాధనకు శ్రద్ధతో కృషి చేయాలి. సమయాన్ని వృథా చేయవద్దు. వ్యసనాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్య ఇస్తూ సామాజిక స్ఫృహను పెంపొందించుకోవాలి. మాది ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా. డిగ్రీ వరకు అక్కడే చదివా. ఢిల్లీ యూనివర్సిటీలో జియోగ్రఫిలో పీజీ పూర్తి చేసి రెండో ప్రయత్నంలో 2019లో ఐపీఎస్ సాధించా. నా విద్య, ఉద్యోగం నగర నేపథ్యంలోనే సాగింది. భువనగిరి జోన్ గ్రామీణ నేపథ్యంలో ఉంది. దీంతో ఎదురయ్యే భాష, తదితర ఇబ్బందులను అధిగమించి ప్రజలతో మమేకమయ్యేందుకు కృషి చేస్తా.