ఉమ్మడి జిల్లా పర్యాటకానికి రోప్‌వే తోరణం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:30 AM
ఎన్నో చారిత్రక, పురాణ, రాజవంశాల పాలన ఆనవాళ్లతో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి జిల్లా మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాపై దృష్టిసారించాయి.

రాష్ట్రంలో మొట్టమొదటి రోప్‌వే
భువనగిరి ఖిల్లాపైకి నిర్మాణానికి రూ.56.81 కోట్లతో టెండర్
యాదగిరిగుట్ట, నల్లగొండలోని హనుమాన్‌కొండ, నాగార్జునసాగర్ రోప్‌వేలకు ప్రతిపాదనలు
భువనగిరి టౌన్,మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఎన్నో చారిత్రక, పురాణ, రాజవంశాల పాలన ఆనవాళ్లతో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి జిల్లా మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాపై దృష్టిసారించాయి. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకానికి ఎంపికైన చారిత్రక భువనగిరి ఖిల్లా అభివృద్ధి, రోప్‌వే నిర్మాణానికి రెండు రోజుల క్రితం పర్యాటకశాఖ రూ.56.81కోట్లతో టెండర్లు పిలిచింది. అలాగే లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సందర్శనకు యాదగిరిగుట్టపైకి, నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌కొండకు, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా రోప్‌వే నిర్మాణానికి పర్వతమాల పథకంలో నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే భువనగిరి ఖిల్లాపైకి రోప్‌వే నిర్మాణానికి టెండర్లు పిలవగా మిగతా మూడు ప్రతిపాదనలకు కూడా కేంద్రం ఆమోదం తెలిపితే ఉమ్మడి జిల్లాలో నిర్మించే రోప్‌వేలు రాష్ట్ర పర్యాటకానికి తోరణాలు కానున్నాయి.
ఎట్టకేలకు ఖిల్లా పనులకు టెండర్లు
భువనగిరి ఖిల్లా అభివృద్ధి కోసం పర్యాటకుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనుంది. ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వంలో కేంద్ర పర్యాటకశాఖ క్యాబినెట్ మం త్రి హోదాలో సుమారు నాలుగేళ్ల క్రితం తొలిసారిగా భువనగిరి పర్యటనకు వచ్చిన నేటి ఉక్కుశాఖ మంత్రి నాడు జరిగిన బహిరంగ సభలో భువనగిరి ఖిల్లాను స్వదేశీ దర్శన్ పథకానికి ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఖిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. మొదటి దశలో కేటాయించిన రూ.56.81కోట్లతో రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారు. మొదటి దశలో ప్రతిపాదించిన పనులు పూర్తయిన వెంటనే రెండో దశలో మరిన్ని పనులు చేపడతారు. దీంతో భువనగిరి ఖిల్లా వైభవం పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే భువనగిరి ఖిల్లాపై ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో సాగుతున్న పర్వతారోహణలో సాగుతున్న శిక్షణతో పదుల సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్టు సహా ప్రపంచంలోని పలు ఎత్తయిన పర్వతాలను అధిరోహించారు. ప్రపంచ పర్వాతారోహణ రంగంలో భువనగిరి ఖిల్లా కీర్తిని సుస్థిరం చేశారు. సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్న భువనగిరి ఖిల్లాపై కోటగోడ తదితర నిర్మాణాలను ఆరో త్రిభువన మల్లా విక్రమాదిత్య పాలనలో నిర్మించినట్టుగా, కాకతీయుల పాలనలో మరిన్ని నిర్మాణాలు సాగినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
రూ.56.81కోట్లతో పనులు ఇలా..
ఖిల్లాకు మొదటి దశలో మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందుకోసం ఇప్పటికే రెండు దఫాలుగా సుమారు నాలుగు ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని సేకరించి నిర్వాసితులకు పర్యాటకశాఖ నష్టపరిహారం చెల్లించింది. పనుల్లో కీలకమైన రోప్‌వేను బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేయనున్న బేస్‌క్యాంప్ నుంచి ఖిల్లాపైకి రూ.15.20కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. రూ.10.73కోట్లతో ఖిల్లా మెట్ల మార్గం ముఖద్వారం నుంచి రోప్‌వే బేస్ క్యాంపు వరకు వంద ఫీట్ల రోడ్డు, పార్కింగ్, రూ.1,037కోట్లతో ప్రస్తుత ఖిల్లా ముఖద్వారం అభివృద్ధి, కార్యాలయ నిర్మాణం, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, రూ.9.40కోట్లతో రెస్టారెంట్లు, వెడ్డింగ్‌జోన్, లిఫ్ట్, గ్లాస్ వాకింగ్ పాత్ తదితర పనులు చేపడతారు. రూ.11.11కోట్లతో తాగు నీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంత కూడళ్లు, గ్రీనరీ, లైటింగ్, సీసీ కెమెరాలు తదితర మౌలిక వసతులు కల్పిస్తారు. భవిష్యత్తులో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం, లేజర్‌షోలు తదితర పనులు చేపట్టే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొట్టమొదటి రోప్‌వే
పర్యాటకరంగంలో రోప్‌వేకు అత్యంత ఆదరణ, ఆకర్శణ ఉంటుంది. భూమట్టానికి వందల మీటర్ల ఎత్తులో తీగల ఆధారంగా గాలిలో తేలినట్టు ఉండే రోప్‌వేతో ఆధారంగా సంచరించడంపై అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో శ్రీశైలం క్షేత్రంలో రోప్‌వే ఉండగా పునర్విభజతో ఏర్పడిన తెలంగాణలో మొట్టమొదటి రోప్‌వేను భువనగిరి ఖిల్లాపైకి నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆనకట్టపై ఐదు కిలోమీటర్లు, ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్టపైకి, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి రెండేసి కిలోమీటర్ల చొప్పున రోప్‌వేల నిర్మాణాన్ని పర్వతమాల ప్రాజెక్టు కింద మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ మూడు ప్రతిపాదనలకు కేంద్రం ఓకే చెబితే ఉమ్మడి జిల్లాలో ఏకంగా నాలుగు రోప్‌వేలు కనువిందు చేయనున్నాయి.
టెండర్లు ఖరారుకాగానే పనులుఐ కె.ధనంజనేయులు, యాదాద్రి జిల్లా పర్యాటకశాఖ అధికారి
చారిత్రాత్మక భువనగిరి ఖిల్లా అభివృద్ధికి స్వదేశీదర్శన్ 2.0లో మంజూరైన రూ.56.81కోట్లతో రాష్ట్ర పర్యాటకశాఖ టెండర్లు పిలిచింది. టెండర్లు ఖరారైన వెంటనే పనులు ప్రారంభమవుతాయి. సుమారు రెండేళ్లలోపు ప్రతిపాదిత పనులు పూర్తిచేయాల్సి ఉంది. రోప్‌వే తదితర పనులన్నీ పూర్తయితే రాష్ట్ర పర్యాటక రంగంలో భువనగిరి ఖిల్లా ఐకాన్‌గా ఉండనుంది. ఇప్పటికే పర్యాటకుల తాకిడి ఉన్న ఖిల్లాకు త్వరలో దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చెపట్టే అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలి.