కళల క్షేత్రం కావాలని..
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:12 AM
ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా వర్ధిల్లుతోన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శాస్త్రీయ అకాడమీ ఏర్పాటుచేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు తోడు వారాంతాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో కొండపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

యాదగిరిగుట్టలో శాస్త్రీయ అకాడమీ ఏర్పాటుకు డిమాండ్
ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా వర్ధిల్లుతోన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శాస్త్రీయ అకాడమీ ఏర్పాటుచేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు తోడు వారాంతాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో కొండపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయారంగాల్లో ప్రావీణ్యం సాధించిన కళాకారులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలోనే శాస్త్రీయ అకాడమీని ఏర్పాటు చేయాలని ఔత్సాహికులు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు శాస్త్రీయ కళలు నేర్చుకునే అవకాశం దక్కాలంటే క్షేత్రంలో నామమాత్రం రుసుంతో అకాడమీ ఏర్పాటుకు స్వామిని కళాకారులు వేడుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట)
విశ్వఖ్యాతిగాంచిన భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, పేరిణి, ధార్మిక, సాహిత్య, సంగీతం వంటి కళలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి. వీటికి జీవం పోసేందుకు 1969లోనే యాదగిరిగుట్టలో ‘నవోదయ కళానిలయం’ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కవులు, కళాకారులు క్షేత్ర మహత్యంపై అనేక పాటలు, పద్యాలు, క్షేత్ర చరిత్ర, నృరసింహ చరిత్రపై పలు నాటకాలు వేశారు. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులు అప్పట్లో అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. అనంతరం ప్రోత్సాహం లేకపోవడంతో కాలక్రమేణా ఆ సంస్థ కనుమరుగైంది.
అకాడమీతో ప్రోత్సాహం
ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, జయంతి ఉత్సవాలు, ప్రత్యేక, పండగ, పర్వ దినాలే కాక ప్రతీ శుక్ర, శని, ఆది వారాల్లో కొండపైన ధార్మిక, సాహిత్య, సంగీత సభలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎక్కడెక్కడో కళలు నేర్చుకొని ఇక్కడ ప్రదర్శనలిచ్చే కళాకారుల విన్నపాల మేరకు దేవస్థానం అనుమతిస్తోంది. ఇదిలా ఉంటే దాతల సహకారంతోనైనా దైవసన్నిధిలో శాస్త్రీయ అకాడమీ నెలకొల్పితే కొత్త తరం కళలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని, అదేసమయంలో స్థానిక ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఇందుకోసం అకాడమీ స్థాపనకు స్థల కేటాయింపు చేయాలని స్థానిక కళాకారులు కోరుతున్నారు. స్థానికులకే కాక రాష్ట్రం నలుమూలల నుంచి ఔత్సాహికులకు నామమాత్రం రుసుంతో నేర్చుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. నిత్యం ఆధ్మాత్మికశోభతో పర్యాటక ప్రదేశంగా దినదినాభివృద్ధి చెందుతోన్న యాదగిరిగుట్ట కళాపోషణకు కేంద్రంగా, కళలకు వేదికగా మారి కళాకారులకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.
కళలను ప్రోత్సహించాలి
విశ్వక్షేత్రంగా విరాజిల్లుతోన్న యాద గిరిగుట్ట క్షేత్రంలో కళలను ప్రోత్సహించాలి. వివిధప్రాంతాల్లోని కళాకారులకు తగినంత ప్రాధాన్యమిచ్చి క్షేత్రంలో జరిగే కళాప్రదర్శనలో అవకాశం కల్పించాలి. తగిన ప్రోత్సాహం లేక ఆసక్తి గల కళాకారులు నిరాశ చెందుతున్నారు. కొండపైన జరిగే ప్రదర్శనలో స్థానికులకు అవకాశం ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక చొరవచూపాలి. అదేవిధంగా అకాడమీ నెలకొల్పేందుకు స్థలం కేటాయించాలి.
మేడి శివకుమార్,కవి, యాదగిరిగుట్ట
స్థానికులకు రెండు రోజులు అవకాశం కల్పించాలి
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు, జయంతోత్సవాల్లో కళా కారులు ఇస్తున్న ప్రదర్శనల్లో స్థానికులకు ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించాలి. కళలపై ఆసక్తి ఉన్న ఔత్సాహితులకు తగిన ప్రోత్సాహం అందజేయాలి. జిల్లాలో ఉన్న కళాకారులు శాస్త్రీయ విద్యను అభ్యసించేందుకు అకాడమీ ద్వారా తోడ్పాటు అందించాలి.
శ్రీపాద శివప్రసాద్, రచయిత, యాదగిరిగుట్ట