ధాన్యం ఆరబెట్టేందుకు నానా అవస్థలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:35 PM
చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం రైతులు ఆరబెట్టారు.
రోజంతా కమ్ముకున్న మబ్బులు
చౌటుప్పల్ టౌన, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం రైతులు ఆరబెట్టారు. రోజంతా మబ్బులు కమ్ముకొని ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడవలసి వచ్చింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం రాశుల కిందకు నీరు చేరు కుంది. సీసీ కల్లం పై పోసిన సుమారు 50 మంది రైతులకు చెందిన ధాన్యం రాశులు తడిశాయి. వాన నీరు రాశుల కిందకు చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. అందులో 10నుంచి 15మంది రైతులకు చెందిన ధాన్యం రాశులు ఎక్కువగా తడిసి పోయాయి. ఐదారుగురి రైతుల కు చెందిన ధాన్యం వాన నీటిలో కొంత దూరం కొట్టుకు పోయింది. ఇదంతా కూడ సీసీ కల్లంపై రాశులు పోసిన ధాన్యం పరిస్థితి. గత పది సంవత్సరాల నుంచి రెండు సీజనలలో వచ్చే ధాన్యాన్ని రైతులు మార్కెట్ యార్డుకు తీసుకురావడం, వర్షాలు కురిసి తడిసిపోవడం ప్రతి సారీ జరుగుతున్న ఒక తంతుగా మారింది. సీసీ కల్లంపై పోసిన ధాన్యం రాశులకే ఈ సమస్య ఎదురవుతోంది తప్ప మిగతా ధాన్యం రాశులకు వానతో పెద్ద సమస్య రావడం లేదు. మండలంలోని ఇతర కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం రాశులు వర్షాలు కురిసినా సురక్షితంగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాలకు చెందిన రైతులు పోటీలు పడి యార్డులోని సీసీ కల్లంపై ధాన్యం పోయడం, వర్షాలు కురిస్తే ధాన్యం రాశులు తడిసి పోవడం ఒక రివాజుగా మారింది. వర్షాలు కురియకుంటే మాత్రం సీసీ కల్లం పై పోసిన ధాన్యం శుభ్రంగా ఉంటుంది. ధాన్యాన్ని శుభ్రం చేయడానికి అనువుగా ఉంటుంది. తరుగు రాదు. మట్టిలో కలవదు. యార్డులో మొత్తం 118 మంది రైతులకు చెందిన ధాన్యం రాశులు ఉన్నాయి. సీసీ కల్లం లేని ప్రాంతంలో టార్పాలిన కవర్‌లు వేసుకుని పోసిన ధాన్యం రాశులు సురక్షితంగా ఉండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
నామా మాత్రంగా ధాన్యం తూకాలు
చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం రెండవ రోజు కేవలం ఇద్దరు రైతులకు చెందిన 480 బస్తాల ధాన్యాన్ని మాత్రమే తూకం వేయించారు. మొదటి రోజు ముగ్గురు రైతులకు చెందిన 650 బస్తాల ధాన్యాన్ని తూకాలు వేయించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రంలో హమాలీల సంఖ్య చాల తక్కువగా ఉండడంతో తూకాలకు ఒకే ఒక్క కాంటాను మాత్రమే ఉపయోగించారు. దీంతో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కూడా పీఏసీఎస్ సిబ్బంది తూకాలను వేయించలేకపోతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటిలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలిపోయాయి. ధాన్యాన్ని తూకాలు వేసేంత వరకు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు.
-బోడపట్ల ముత్యంరెడ్డి, రైతు, పెద్దకొండూరు, చౌటుప్పల్ మండలం
1000 టార్ఫాలిన కవర్లను ఇప్పించాలి
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కు 1000 టార్ఫాలిన కవర్లను ఇప్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.వీరారెడిని ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య కోరారు. భువనగిరిలోని ఆయన కార్యాలయంలో శనివారం అడిషనల్ కలెక్టర్‌ను చైర్మన వెంకటయ్య కలిశారు. టార్ఫాలిన కవర్‌లు తగినన్ని లేక పోవడంతో వర్షాలు కురిసినప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాశులపై కప్పేందుకు కవర్‌లు లేక పోవడంతో ధాన్యం తడిసి పోయే అవకాశాలు ఉన్నాయని చైర్మన వివరించారు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఒక వెయ్యి టార్ఫాలిన కవర్ లను ఇచ్చించాలని ఆయన కోరారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ నిబందన లేకుండా కొనుగోలు చేయింంచాలని, ధాన్యం తూకాలకు కొరత లేకుండా గన్నీ బ్యాగులను సరఫరా చేయించాలని కోరారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ కు ఏఎంసీ చైర్మన వెంకటయ్య వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మునుగోడు అసెంబ్లీ ఇనచార్జ్ పబ్బు రాజు, ఏఎంసీ డైరెక్టర్‌లు ఎండీ.గౌ్‌సఖాన, పబ్బు శ్రీకాంత, మొగుదాల రమేష్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. అంతకు ముందు చౌటుప్పల్‌లోని మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.