పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:22 AM
పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు పెండింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో అవస్థలుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్చిలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందని నిధులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.150కోట్ల వరకు బకాయిలు
వడ్డీల భారంతో ఇబ్బంది పడుతున్నామంటున్న మాజీలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు పెండింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో అవస్థలుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం ముగిసి ఏడాదిన్నరైనా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దారుణమని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామపంచాయతీలు ఉండగా, సుమారు రూ.150కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తక్షణమే చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,740 గ్రామపంచాయతీలు ఉండగా నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేటలో 475, యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు నిధులిచ్చేవి. గ్రామాల్లో ఈ నిధులతోనే అభివృద్ధి పనులు నిర్వహిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి ఈ నిధులు వచ్చేవి. దీంతో పనులు చేస్తే ఢోకా ఉండదనే నమ్మకంతో సర్పంచ్‌లు సొంత పైసలతో పనులు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం,అదే సమయంలో పాలవకర్గాల గడు వు ముగియడం, తదితర కారణాలతో చేసిన పనుల కు బిల్లులు నిలిచిపోయాయి. సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణా లు, డ్రైనేజీలు, వీధిదీపాల ఏర్పాటు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, పైప్‌లైన్లు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు, క్రీడామైదానాలు, వాటర్ మోటర్లు ఏర్పా టు వంటి పనులకు చేసిన బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్‌లు వాపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ పనులకు సంబంధించి సుమారు రూ.150కోట్ల వరకు బకాయిలున్నాయి. నల్లగొండ జిల్లాలోరూ.60 కోట్లు సూర్యాపేట జిల్లాలో రూ.50కోట్లు, యాదాద్రి జిల్లాలో సుమారు రూ.40కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ బిల్లులు రావాల్సి ఉంది. ప్రతీ మండలం నుంచి బకాయిలున్నాయని పేర్కొంటున్న సర్పంచ్‌లు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. ఈ పనులు చేపట్టేందుకు డబ్బు అప్పుగా తెచ్చామని, ఏడాదిన్నర కాలంగా వడ్డీ చెల్లిస్తుండడంతో భారం పెరిగి ఇబ్బంది కలుగుతోందని మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, పూర్తిస్థాయి చెల్లింపులు చేయలేదు. ఇంకా బిల్లు బకాయిలున్నాయని, తక్షణం వాటిని చెల్లించాలని వారు కోరుతున్నారు.
రూ.10లక్షల వరకు బిల్లులు పెండింగ్ : ఈడం రోజా, గట్టుప్పల్ మాజీ సర్పంచ్
మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు రైతు వేదిక, పల్లె ప్రకృతివనాలకు సంబంధించిన బిల్లులు సుమారు రూ.10లక్షల వరకు రావాల్సి ఉంది. రెండేళ్ల నుంచి బిల్లులు రాకపోవడంతో అవస్థపడుతున్నాం. ఎంబీలు సైతం చేసినా బిల్లులు మంజూరు చేయడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి పాత బిల్లులు వెంటనే చెల్లించాలి.
రెండేళ్ల నుంచి రూ.20లక్షలు ఆగాయి : రొట్టెల రమేష్, తిప్పర్తి మాజీ సర్పంచ్
గ్రామంలో పల్లెప్రగతి కింద చేపట్టిన డ్రైనేజీల నిర్మాణాలు, ఎస్‌ఎ్‌ఫసీ కింద చేపట్టిన పనులు, పైప్‌లైన్ల ఏర్పాటు, నర్సరీలు, ట్రాక్టర్ల నిర్వహణలకు సంబంధించిన సుమారు రూ.20లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు వస్తాయనే నమ్మకంతో వడ్డీలకు తెచ్చి పనులు చేయించాం. వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఇస్తామంటున్నారే తప్ప రావడం లేదు.
బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం: దండ రేణుక, భైరవునిబండ మాజీ సర్పంచ్, శాలిగౌరారం మండలం
మా పంచాయతీలో మేం చేసిన ‘మన ఊరు-మనబడి’ పనులు, ఇంకుడు గుంతల పనులు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, క్రీడాప్రాంగణం ఏర్పాటుకు సంబంధించి సుమారు రూ.30లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మా ఇబ్బందులు గుర్తించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి.
ఏడాదైనా రూ.6లక్షలు రాలేదు: దేశబోయిన మల్లమ్మ, వెలిమినేడు మాజీ సర్పంచ్, చిట్యాల మండలం
నేను సర్పంచ్‌గా ఉన్న కాలంలో చేసిన పారిశుధ్యపనులు, పల్లె ప్రకృతివనం ఏర్పాటు, విద్యుత్ మోటార్లు, పైప్‌లైన్ల మరమ్మతులతో పాటు ఇతర బిల్లులు సుమారు రూ.6లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. సర్పంచ్ బాధ్యతల్లో ఉన్నప్పటి నుంచే రాజకీయవైరంతో మాకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాకయినా బిల్లులు వస్తాయని ఆశించినా చెల్లించడంలేదు. వడ్డీలకు తెచ్చి పనులు చేయించాం. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.