Share News

పక్కాగా పౌష్టికాహారం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:10 AM

అంగన్‌వాడీ కేంద్రాల ను ప్రక్షాళన చేసి మరింత బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందించేందుకు ప్రణాళిక రూపొందించింది.

పక్కాగా పౌష్టికాహారం

జగిత్యాల, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ను ప్రక్షాళన చేసి మరింత బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు పక్కదారి పట్టకుండా టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోం రేషన్‌) తీసుకెళ్లే లబ్ధిదారు ఫొటో తీసి పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది చేతివాటంతో అంగన్‌వాడీ గుడ్లు, పాలు, పప్పు వంటివి బహిరంగ మార్కెట్‌లో దర్శనమిస్తున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో కేంద్రాలు నామమాత్రంగా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. కేంద్రానికి వచ్చిన సరుకులు, విద్యార్థులు హాజరు, అంగన్‌వాడీ కేంద్రాన్ని పూర్తిగా సీసీ కెమెరాలతో పరిశీలించేలా, టీహెచ్‌ఆర్‌లో సరుకుల పంపిణీని అప్‌లోడ్‌ చేసేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల నమోదు తెలుసుకోవడానికి బయోమెట్రిక్‌ హాజరుకు చర్యలు చేసుకుంటోంది.

- జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలుండగా ఇందులో 1,037 మెయిన్‌ కేంద్రాలు, 28 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. సుమారు యేడాది క్రితం మినీకేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్పు చేసింది. ఇందులో 272 కేంద్రాలకు సొంత భవనాల్లో, 537 అద్దె భవనాల్లో, 256 ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో 225 కేంద్రాలు ఇంతకు ముందు ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తుండగా 58 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సొంత భవనాల్లో 138 భవానాలకు మరమ్మతులు అవసరం ఉంది. అలాగే 38 అంగన్‌వాడీ కేంద్రాల సొంత భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం గర్భిణులు, బాలింతలు 12,394 మంది ఉండగా, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 34,748 మంది, మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు 13,969 మంది ఉన్నారు. చిన్నారుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

- పారదర్శకంగా నిర్వహించేందుకే..

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను పారదర్శకం చేసేందుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని ముందుగా మూడేళ్ల లోపు చిన్నారులకు వర్తింపజేయనున్నారు. వీరికి టీహెచ్‌ఆర్‌, బాలామృతం అందిస్తున్నారు. ఈ వివరాలను పోషణ్‌ అభియాన్‌ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇందులోనే ప్రస్తుతం ఫేస్‌ అథెంటికేషన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చారు. ఇందులోనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌, ఫొటో, లబ్ధిదారుల సెల్‌ నంబరు సంఖ్యను నమోదు చేస్తారు. ఇది పూర్తికాగానే లబ్ధిదారుడి సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌ను యాప్‌లో నమోదు చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం సరుకులు, బాలామృతం అందించిన ప్రతిసారి ఫొటో గుర్తింపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అమలు చేయనున్నట్లు అధికారులు అంటున్నారు.

- పంపిణీ ఇలా..

అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన వారికి నిత్యం 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, నూనె, గుడ్డు, మురుకులు, బాలామృతం అందజేస్తున్నారు. అంగన్‌వాడీలో నమోదైన మూడేళ్లలోపు చిన్నారులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం సరుకులను అందజేస్తున్నారు. ఇవి పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా బోగస్‌లకు అడ్డుకట్ట వేయాలని మాతా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులకు సంబందించి కేంద్రం నుంచి సరుకులు తీసుకువెళ్లే వారి ఫొటో పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేయనున్నారు. ముందుగా వారి వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. దీనిపై అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణను సైతం అందించనున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట

- బోనగిరి నరేశ్‌, జిల్లా సంక్షేమాధికారి, జగిత్యాల

అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకుల పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని చేపట్టాలని ఆదేశించింది. ఈమేరకు కేంద్రాల నుంచి సరుకులు తీసుకువెళ్లే వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి నెలా వారే వచ్చి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈవిధానంతో అవకతవకలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.

Updated Date - Jan 02 , 2025 | 01:11 AM