Ponguleti: ఏప్రిల్ నుంచే భూభారతి
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:23 AM
ఏప్రిల్ నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడానికి గర్వపడుతున్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టాన్ని రిఫరెండంగా చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

ఇదే రిఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్తాం
బీఆర్‌ఎస్ హయాం నాటి భూ లావాదేవీలపై
ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం: పొంగులేటి
ధరణిని బంగాళాఖాతంలో కలపమనే ప్రజలు
మాకు అధికారం ఇచ్చారు: డిప్యూటీ సీఎం భట్టి
అనుభవదారు కాలమ్ మళ్లీ వద్దు: పల్లా
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడానికి గర్వపడుతున్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టాన్ని రిఫరెండంగా చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. శాస్త్రీయంగా, ప్రజలందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే భూభారతి చట్టాన్ని తెచ్చామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజల నుంచి మరిన్ని సూచనలు వస్తే స్వీకరిస్తామని వెల్లడించారు. శాసనసభలో బుధవారం వివిధ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా భూభారతి చట్టంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. మాన్యువల్ పహాణీ, అనుభవదారు కాలమ్‌ను రికార్డుల్లో చేర్చొద్దని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 3,795 మంది వారసత్వ వీఆర్‌ఏలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ధరణి వంటి దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చిన వారికి.. భూభారతిపై మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. వీఆర్‌ఏ, వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసి, 23 వేల మంది ఉద్యోగులను రోడ్డుమీద పడేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది అని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను త్వరలోనే పునరుద్ధరించనున్నామన్నారు.
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల్లో గ్రామ పాలన అధికారులను నియమించడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. గత సమావేశాల్లో చెప్పిన విధంగా బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన భూలావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భూములపై హక్కులు కల్పించామని గుర్తు చేశారు. 70 ఏళ్ల పోరాటం ఫలితంగా ఏర్పడిన అనుభవదారు కాలాన్ని బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క కలం పోటుతో తొలగించారని ధ్వజమెత్తారు. బాజాప్తాగా ధరణిని బంగాళాఖాతంలో కలపాలనే ప్రజలు కాంగ్రె్‌సకు ఓటేశారని గుర్తు చేశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రికార్డులను సరిచేయడమే జమాబందీ అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య రికార్డులు రాయడం కరెక్టా? ప్రజల మధ్య రికార్డులు సరిచేయడం కరెక్టా? అని ప్రశ్నించారు. పోలీసులను రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారన్న పల్లా ఆరోపణలపై మంత్రి పొన్నం స్పందిస్తూ.. పోలీసులను వినియోగించుకొని అధికారం చలాయిస్తే తామూ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని, తమకు అలాంటి అవసరం లేదన్నారు. మధ్యలో మంత్రులు మాట్లాడడంపై బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన తెలపగా... ప్యానల్ స్పీకర్ రేవూరి కల్పించుకొని..మంత్రులకు అవకాశం ఇవ్వడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News