Ponguleti: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:30 AM
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని కేసీఆర్... అధికారంపై పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు.

14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది?: పొంగులేటి
ఎవరి గ్రాఫ్ పడిపోయిందో ప్రజలకు తెలుసు: జూపల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని కేసీఆర్... అధికారంపై పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే తనకు పదేళ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్‌కు 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కేసీఆర్ సీజనల్ రాజకీయ నాయకుడని, ఎన్నికల సమయంలోనే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారని దుయ్యబట్టారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నందునే ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ భవిష్యత్తు గురించి చెప్పే కేసీఆర్... ముందు ఆయన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఎప్పటికీ ఆయన్ను క్షమించదన్నారు. రాష్ట్రంలో ఎవరి గ్రాఫ్ పడిపోయిందో ప్రజలకు తెలుసునని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడంతో ఇన్నాళ్లూ కేసీఆర్ మొహం చాటేశారన్నారు. ఇన్ని నెలల తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకు గుర్తుకు వచ్చారన్నారు. మునిగి పోతున్న బీఆర్‌ఎస్ నావను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌కు 15 నెలల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా? అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ ప్రశ్నించారు.