Priyadarshini Jurala Project: జూరాల.. నీళ్లు ఎలా?
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:54 AM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంటల సాగుకు అత్యంత కీలకమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదు. కృష్ణానది తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత ఉన్న తొలి ప్రాజెక్టు ఇదే అయినప్పటికీ దీని కింది ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు
4 టీఎంసీల మేర పేరుకుపోయిన పూడిక
మిగిలిన సామర్థ్యం మేరకైనా నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి
మహబూబ్‌నగర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంటల సాగుకు అత్యంత కీలకమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదు. కృష్ణానది తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత ఉన్న తొలి ప్రాజెక్టు ఇదే అయినప్పటికీ దీని కింది ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుకు ప్రతీఏట వందలాది టీఎంసీల వరద వచ్చినా రెండు పంటలకు నీరివ్వలేక క్రాప్ హాలిడేలు, వారబందీలను అమలు చేస్తున్నారు. ప్రాజెక్టులో దాదాపు 4టీఎంసీల సామర్థ్యం మేర పూడిక పేరుకుపోవడం, బురద నీళ్లు పోగా సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోగలిగిన నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికారులు సరిగా అంచనా వేయకపోవడంతో వరద అంతా సముద్రం పాలవుతోంది. ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు 1,122 టీఎంసీల వరద వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టు 1.04 లక్షల ఎకరాలు. ప్రతీ ఏటా వరద ప్రారంభమైన వెంటనే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. అయితే ప్రాజెక్టు ఎగువన మొత్తం నల్లరేగడి నేలలు కావడంతో బురద మట్టి కొట్టుకువచ్చి ప్రాజెక్టులో భారీగా పేరుకుపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.96 టీఎంసీల నీరు ఉండగా ఇందులో వాడుకోగలిగిన నీళ్లు(లైవ్ స్టోరేజీ) 3.262 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యాసంగిలో వారబందీ ప్రకారం మొత్తం ఆయకట్టుకు కాకుండా కేవలం 35 వేల ఎకరాలకు నీరివ్వాలని నీరుపారుదల సలహా బోర్డు(ఐఏబీ) నిర్ణయించింది. ఆ మేరకు నీరివ్వాలన్నా కనీసం 3.5 టీఎంసీల లైవ్ స్టోరేజీ ఉండాలి. లైవ్ స్టోరేజీలో మిషన్ భగీరథకు కూడా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
కర్ణాటక నుంచి సీపేజీ అంతంతే
సాధారణంగా వరద వచ్చే రోజుల్లో సాధ్యమైనన్ని నీళ్లను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలి. వరద ఆగిపోయిన తర్వాత ఎగువ నుంచి వచ్చే సీపేజీ వాటర్‌పై ఆధారపడతారు. కానీ ఎగువన ఉన్న కర్ణాటకలో కొన్నేళ్లుగా సీపేజీ వాటర్ అనుకున్న స్థాయిలో రావడం లేదు. కర్ణాటక రోడ్ కం బ్యారేజీలు నిర్మించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో కూడా వారబందీ అమలు చేస్తుండటం వల్ల దిగువకు ఇన్‌ఫ్లో ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం సగటున 700 క్యూసెక్కులకు మించి ఇన్‌ఫ్లో రావడంలేదు. ఇటీవల ఉమ్మడి జిల్లా సమీక్ష సందర్భంగా మక్తల్, గద్వాల ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహను.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున నారాయణపూర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఒప్పించాలని అభ్యర్థించారు. గత ఏడాది కూడా ఇలాగే జూరాల పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తగా 1.90 టీఎంసీలను నారాయణపూర్ నుంచి విడుదల చేయించారు.
ఎత్తిపోతలకు ఇబ్బందే
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టుతో పాటు రాజీవ్ భీమా 1, 2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు కూడా దీని ఆధారంగా నడుస్తున్నాయి. అలాగే మిషన్ భగీరథ పథకాలకు కూడా ఇక్కడి నుంచే నీటిని తీసుకోవాలి. ఎగువ నుంచి సీపేజీ నీళ్లు రాకపోవడంతో ప్రధాన ఆయకట్టుకే ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలు ప్రశ్నార్థకం కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే