Share News

అవనిపై హరివిల్లు

ABN , Publish Date - Jan 06 , 2025 | 02:16 AM

అవనిపై హరివిల్లు కనువిందు చేసింది. సప్తవర్ణాలతో మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మెహెర్‌నగర్‌లో ఆదివారం శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్‌ పార్ట్‌నర్‌ క్రాప్ట్‌వారి ఫర్‌ఫెక్ట్‌.. ప్యాషన్‌ పార్ట్‌నర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌ ) పోటీలు ఉత్సాహంగా సాగాయి.

 అవనిపై హరివిల్లు
సిరిసిల్లలో ముగ్గులు వేస్తున్న మహిళలు

- ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల సందడి

- జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా సాగిన పోటీలు

- బహుమతులు పొందిన మనుశ్రీ, రూపిక, కల్పన

(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)

అవనిపై హరివిల్లు కనువిందు చేసింది. సప్తవర్ణాలతో మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మెహెర్‌నగర్‌లో ఆదివారం శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్‌ పార్ట్‌నర్‌ క్రాప్ట్‌వారి ఫర్‌ఫెక్ట్‌.. ప్యాషన్‌ పార్ట్‌నర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌ ) పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి చుక్కలన్నీ ముగ్గులయ్యే విధంగా రంగవళ్లులను తీర్చిదిద్దారు. ముగ్గులు వేయడానికి ఒకరినొకరు పోటీ పడ్డారు. సప్త వర్ణాలతో తెలంగాణ సంప్రదాయలు ఉట్టిపడేలా వేసినముగ్గులు శోభను ఇచ్చాయి. విభిన్న ఆకృతులతో పాటు సంక్రాంతి సంన్రదాయాలను ఉట్టిపడే విధంగా అలంకరించారు. ముగ్గుల పోటీలకు 32 మంది మహిళలు, వారి సహాయకులుగా మరో 30 మంది హాజరయ్యారు. విజేతలకు సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కో స్పాన్సర్‌ శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పల్లె రాజురెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.ఉమ, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ టీవీ నారాయణ బహుమతులను అందజేశారు. వింధ్య, రజని, అనూష న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

విజేతలు వీరే..

ఎంతో ఆసక్తిగా సాగిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని దబ్బెడ మనుశ్రీ (ముస్తాబాద్‌), ద్వితీయ బహుమతిని ఎలిగేటి రూపిక, తృతీయ బహుమతిని గుంట కల్పన (సిరిసిల్ల), కన్సొలేషన్‌ బహుమతులను పి.సిరి, డి.వెంకటలక్ష్మీ, ఎం.సునీత, ఎం.భార్గవి, డి.శ్రీలత గెలుచుకున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలతోపాటు జ్ఞాపికలు, సరిఫికెట్లు అందజేశారు.

కన్సొలేషన్‌ బహుమతులుగా రూ.500 నగదుతో పాటు జ్ఞాపిక, సర్టిఫికెట్‌ అందించారు. అదేవిధంగా పాల్గొన్నవారందరికీ జ్ఞాపికలు, సర్టిఫికెట్లను అందజేశారు.

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలి

- మున్సిపల్‌ చైర్‌పర్సప్‌ జిందం కళాచక్రపాణి

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలని, భవిష్యత్‌ తరాలవారికి అందించే విధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కనుమరుగవుతున్న తెలుగు సంప్రదాయాలను పదిలపరుస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మహిళలు కొద్దిపాటి స్థలంలోనైనా ముగ్గులు వేసుకుంటారన్నారు. ఏటా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను ఇలాగే కొనసాగిం చాలన్నారు. ముగ్గుల పోటీలతో మహిళల్లో మన సంస్కృతీసంప్రాదాయలను గౌరవించే విధంగా అలోచనలు కలుగుతాయన్నారు. పోటీకి సహకరించిన స్పాన్సర్లను అభినందించారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పల్లె రాజురెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉమ, ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ టీవీ నారాయణ, రిపోర్టర్లు దాసరి దేవేందర్‌, చింతకింది శ్యాంకుమార్‌, సిద్దుల మురళి, గడ్డం సత్యనారాయణరెడ్డి, తూముకుంట శ్రీనివాసరెడ్డి, అమరగొండ కిషన్‌, పాపగారి యాదగిరి, కంకణాల సాయి శరత్‌, రాచర్ల రాజు, ఎలిగేటి సూర్యకిరణ్‌, పిల్లి శ్రీనివాస్‌, కౌడగాని సత్యం, దుంపేటి గౌరీశంకర్‌, సీహెచ్‌ మైలారం, అరుణ్‌కుమార్‌, ఇరుకుల్ల ప్రవీణ్‌, అడ్వర్టైజ్‌మెంట్‌ రిప్‌ సాయి, ఆపరేటర్‌ అనిల్‌, స్కూల్‌ సిబ్బంది షాహీద్‌, సాయి, అంజనేయులు, బాబు, నవీన్‌, ప్రణవి, సుజాత పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయం

- పల్లె రాజురెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌

మహిళలను ప్రొత్సహిస్తూ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం. ముగ్గుల పోటీల్లో గెలుపు, ఓటములు సహజం. నిబంధనల ప్రకారం విజయం ముగ్గురిని వరించినా మిగతా వారు నిరుత్సాహపడకుండా పోటీలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ముగ్గులు వేయడం మహిళలకు వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో భాగస్వాములయ్యారు.

మహిళల్లో దాగిన ప్రతిభ వెలుగులోకి

- పి.ఉమ, వైస్‌ ప్రిన్సిపాల్‌

పోటీల ద్వారా మహిళల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముగ్గుల పోటీలు సృజనాత్మకతకు అద్దం పడుతాయి. ప్రతీ ముగ్గులో ప్రజల జీవన విధానం ప్రతిబింబిస్తుంది. ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం. మహిళలంతా ఒక చోట చేరి ముగ్గులు వేయడం ఎంతో సందడిగా కనిపించింది.

చాలా సంతోషంగా ఉంది

- దబ్బెడ మనుశ్రీ ప్రథమ బహూమతి

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలో మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ వచ్చిందటే ముగ్గుల పోటీకి ఎదురుచూస్తాం. ముగ్గులు వేయడమంటే ఎంతో ఇష్టం.

Updated Date - Jan 06 , 2025 | 02:16 AM