Share News

రూ.207కోట్లు తాగేశారు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:04 AM

న్యూ ఇయర్‌ వేడుకలు ఫుల్లు కిక్కెకించాయి. డిసెంబర్‌ 31న యువత మత్తులో మునిగి తేలారు. గ్రాండ్‌ సెలబ్రేషన్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి.

రూ.207కోట్లు తాగేశారు!

న్యూ ఇయర్‌కు జోరుగా మద్యం అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల్లో రికార్డు

సర్కారుకు దండిగా ఆదాయం

216 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

న్యూ ఇయర్‌ వేడుకలు ఫుల్లు కిక్కెకించాయి. డిసెంబర్‌ 31న యువత మత్తులో మునిగి తేలారు. గ్రాండ్‌ సెలబ్రేషన్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. తగ్గేదేలే అంటూ మద్యం ప్రియులు తెగ తాగేశారు. బీర్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన అమ్మకాలతో సర్కారుకు దండిగా ఆదాయం సమకూరింది.

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 29 నుంచి 31 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.208.24 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, ఈ సారి ఆ మూడు రోజులు రూ.207.95 కోట్ల విక్రయాలు జరిగాయి. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో మద్యం షాపులు మూడు రోజుల పాటు కిటకటలాడాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దాబాలు, ఫాంహౌ్‌సలు, రిసార్ట్స్‌ల్లో మద్యం ప్రియులు తాగడంలో ఏమాత్రం తగ్గలేదు. ఐఎంఎల్‌ కేసులకు సంబంధించి గత ఏడాది 1,80,196 కాటన్లు అమ్ముడు పోగా, ఈ సారి 1,74,166 కాటన్లు అమ్ముడు పోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఐఎంఎల్‌ కేసెస్‌ కాస్త తగ్గాయి. ఇక బీరు మాత్రం జోరందుకుంది. గత ఏడాది కంటే ఎక్కువగా బీర్ల అమ్మకాలు సాగాయి. పోయిన సంవత్సరం 1,77,814 కాటన్‌ బీరు అమ్మకాలు జరగ్గా, ఈ సారి మూడు రోజుల్లో 2,03,609 కాటన్లు అమ్ముడుపోయాయి. 2024 డిసెంబర్‌ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్తసంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్న సంబరాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి.

రంగారెడ్డి జిల్లాలో వంద కోట్లకు పైగా...

రంగారెడ్డి జిల్లాలో రూ.106.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే మేడ్చల్‌ జిల్లాలో రూ. 91.85 కోట్లు, వికారాబాద్‌ జిల్లాలో రూ.9.75కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ విక్రయాలు మూడు రోజుల్లో జరగడం విశేషం.

అత్యధికంగా శేరిలింగంపల్లిలో..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో అత్యధికంగా రూ.28.69 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే అత్యల్పంగా వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో రూ.1.13 కోట్లు విక్రయాలు సాగాయి. శేరిలింగంపల్లి తర్వాత స్థానంలో బాలానగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌లో రూ. 20.77 కోట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే శంషాబాద్‌ డివిజన్‌లో రూ.20.82 కోట్ల అమ్మకాలు జరగగా, ఘట్‌కేసర్‌లో రూ.20.28 కోట్ల మద్యం కొనుగోళ్లు జరిగాయి.

ఉమ్మడి జిల్లాలో 216 డ్రైంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

డిసెంబర్‌ 31 సందర్భంగా చాలామంది మద్యం తాగా రోడ్డెక్కారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 216 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 142 కేసులు నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లాలో 35, మేడ్చల్‌ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు పరిధిలో 40 కేసులు నమోదు కాగా, ఇబ్రహీంపట్నంలో 24 కేసులు, చేవెళ్లలో 48 కేసులు, షాద్‌నగర్‌లో 30 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 30 శాతం అధికంగా అమ్మకాలు

న్యూఇయర్‌ సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌, మల్కాజిగిరి ప్రొహిబిషన్‌ జోన్‌లున్నాయి. మేడ్చల్‌ జోన్‌ పరిధిలో 114 మద్యం దుకాణాలు, 95 బార్లున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా రెండు రోజుల్లో 30, 31న 43 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ నెల మొత్తం రూ.265 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, కేవలం రెండు రోజుల్లోనే రూ.43 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే రూ.6 కోట్లు (30 శాతం) అమ్మకాలు పెరిగినట్లు మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ఎస్‌కె.ఫయాజ్‌ తెలిపారు. అదేవిధంగా మల్కాజిగిరి జోన్‌ పరిధిలో 88 మద్యం దుకాణాలు, 112 బార్లు ఉండగా.. డిసెంబర్‌ 30, 31న రూ.42.64 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ నెల మొత్తం 224 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా కేవలం చివరి రెండు రోజుల్లో రూ.42.64 కోట్ల మద్యం అమ్మకాలు జరుగడం విశేషం.

Updated Date - Jan 02 , 2025 | 12:04 AM