Share News

అంబరాన్నంటిన భోగి సంబురాలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:40 PM

సంక్రాంతి సంబురాల్లో భాగంగా సోమవారం భోగి వేడుకలు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కనుల పండుగగా జరిగాయి.

అంబరాన్నంటిన భోగి సంబురాలు
వికారాబాద్‌: భోగి మంటలు వేస్తున్న స్థానికులు

వికారాబాద్‌/తాండూరు/తాండూరు రూరల్‌/పరిగి/పూడూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబురాల్లో భాగంగా సోమవారం భోగి వేడుకలు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కనుల పండుగగా జరిగాయి. ఉదయం మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను అందంగా వేశారు. తెల్లవారుజామున భోగి మంటలు కాల్చారు. మహిళలు ఇళ్లలో పిండి వంటలు చేయడంలో నిమగ్నమయ్యారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. వికారాబాద్‌ పట్టణంలో మహాశక్తి చౌరస్తాలో ఏర్పాటు చేసిన పంతగుల దుకాణాల వద్ద పతంగులు కొనుగోలు చేసేందుకు యువకులు పోటీపడ్డారు. తాండూరులోని గాంధీనగర్‌లో మహిళలు స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఠాకూర్‌ ఆధ్వర్యంలో భోగి మంటలు కాల్చి ఆటపాటలతో సందడిగా గడిపారు. తాండూరులోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గంగిరెద్దు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పరిగితోపాటు, ఆయా గ్రామాల్లో ఉదయం బోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. ఆడపడుచులు వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గులు వేశారు. యవకులు, విద్యార్థులు ఆయా గ్రామాల్లో గాలి పటాలు ఎగరవేశారు. పూడూరు మండల కేంద్రంతోపాటు సోమన్‌గుర్తి, చెన్‌గోముల్‌, కంకల్‌తోపాటు తదితర గ్రామాల్లో మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. యువకులు గాలిపటాలు ఎగుర వేయగా, ఇళ్లల్లో పిండి వంటలు ఘుమఘుమలాడాయి.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్‌ ప్రతినిధి/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌: ధనుర్మాస పర్వంలో భాగంగా ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ సోమవారం భోగితో ప్రారంభమైంది. భోగి మంటలతో పాటు ఇళ్ల ముందు మహిళలు ముగ్గులు వేసి వాటిలో గొబ్బెమ్మలు పెట్టి నవఽధాన్యాలతో అందంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. ఆలయాలకు వెల్లి ప్రత్యేక పూజలు చేశారు. యువకులు గాలిపటాలను ఎగరవేశారు. మండల కేంద్రం శామీర్‌పేట కట్టమైసమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాలలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అలియాబాద్‌ చౌరస్తా సమీపంలోని శ్రీ రత్నాలయ వేంకటేశ్వర్‌స్వామి ఆలయంలో భక్తుల కిక్కిరిసిపోయారు. అదేవిధంగా శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం జనాలు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులతోపాటు గొబ్బెమ్మలను పెట్టారు. భోగి మంటలు వెలిగించారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలో పలుచోట్ల చిన్నారులకు భోగి పండ్లు పోసి పూజలు నిర్వహించారు.

పోలీసుల ఆటవిడుపు

తాండూరు: నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే పోలీసులు సోమవారం సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తాండూరు విలియామూన్‌ హైస్కూల్‌ మైదానంలో పోలీసులు సందడి చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు ఎస్‌ఐలు విఠల్‌రెడ్డి, శంకర్‌లు గాలిపటాలను ఎగురవేశారు.

Updated Date - Jan 13 , 2025 | 11:40 PM