Share News

హస్తవ్యస్తం!

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:26 AM

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఆ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. నాయకుల మధ్య రోజు రోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రజా ప్రతినిధులు, నేతల పనితీరుపై ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హస్తవ్యస్తం!

మారని కాంగ్రెస్‌ నేతల తీరు

అధికార పార్టీ నాయకుల మధ్య కుదరని సయోధ్య

ఇంకా పూర్తికాని ఇందిరమ్మ కమిటీల నియామకం

ఇళ్ల మంజూరు సంక్రాంతిలోపు సాధ్యమేనా?

ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎదురుచూపు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న గందరగోళంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సర్కార్‌ నిర్ణయించింది. కానీ జిల్లా నాయకుల మధ్య సయోధ్య కుదరక కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీంతో సంక్రాంతి పండగ వరకు ఇళ్లు వస్తాయని ఆశపడిన పేదలకు నిరాశే మిగిలింది.

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఆ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. నాయకుల మధ్య రోజు రోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రజా ప్రతినిధులు, నేతల పనితీరుపై ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను మారానని.. ఇక నుంచి అందరూ మారి బుద్ధిగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని’’ హితబోధ చేశారు. అయినా.. నేతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇందిరమ్మ గృహాలకు సంబంధించి గత ఏడాది నవంబరు 6న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి, 15-20వ తేదీ వరకు జాబితాను ఖరారు చేసి, ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ అడుగు ముందుకు పడటం లేదు. ఈ పథకం కింద తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలు, రెండో విడతలో స్థలం లేని వారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు.

కమిటీలు ఇంకెప్పుడు?

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై అర్హుల కోసం అధికారులు చేపట్టిన సర్వే ఇంకా పూర్తి కాలేదు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం ప్రారంభించిన సర్వే జిల్లాలో ఇంకా కొనసాగుతోంది. సర్వే పూర్తయిన తరువాత ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలని దాదాపు మూడు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్‌ సూచనల మేరకు కమిటీ సభ్యులను ఎంపిక చేసి ఆయా జిల్లాల కలెక్టర్‌ల ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. దానికి మంత్రి ఆమోదం తెలుపుతారు. అయితే దాదాపు మూడు నెలలుగా ప్రతిపాదనల కోసం కమిటీల ఎంపిక కొనసాగుతూనే ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

నేతల మధ్య కొరవడిన సయోధ్య..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య సయోధ్య కొరవడింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే లేరు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలే ఇన్‌చార్జులుగా కొనసాగుతున్నారు. నియోజకవర్గ బాధ్యతలు వారే చూసుకుంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే ఏ కార్యక్రమాలు కూడా ఆశించిన రీతిలో ముందుకుసాగడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు ఆశించిన తీరులో ముందుకు సాగటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 11 , 2025 | 12:26 AM