Share News

వైభవం.. గోదా కల్యాణం

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:44 PM

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.

వైభవం.. గోదా కల్యాణం
చీర్యాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కల్యాణం

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ దంపతులు పద్మ జగన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో అర్చకులు కుంతీ పురం నారాయణాచార్యులు, ఆలయ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, నరేంద్ర చారి, సుదర్శన్‌ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కీసర మండలం చీర్యాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ , మల్లారావు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి పాల్గొన్నారు

కొడంగల్‌: కొడంగల్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగిన ధనుర్మాస పూజలు కల్యాణంతో ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, గంటా అనంతరం శ్రీ ధరూరీ శ్రీనివాసచార్యులు తిరుప్పావై ప్రవచనం చేశారు. మకర సంక్రాంతి పండగ రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. మరునాడు ఉదయం 8 గంటలకు వరహా స్వామి ఆలయ ఆవరణలో తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఘటకేసర్‌: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్‌ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా సమేత రంగనాయక స్వామి కల్యాణోత్సవంను సోమవారం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ నర్రి మంజులశ్రీశైలం, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, పి కొండల్‌రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:44 PM