నార్త్ సిటీలోనూ మెట్రో పరుగులు
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:08 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో పొడగింపుపై ఆదేశాలు జారీ చేశారు.
మేడ్చల్, శామీర్‌పేట్ వరకు పొడిగింపు
నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్ ప్రకటన
డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
త్వరలో నార్త్‌సిటీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్ రంగం
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో పొడగింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగర శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు కందుకూరు, హయత్‌నగర్ ప్రాంతాలకు మెట్రో లైన్ పొడిగిస్తూ ప్రభుత్వం ప్రణాళికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తర భాగానికి కూడా మెట్రో కావాలనే డిమాండ్ రావడంతో దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ ప్రతినిధి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మేడ్చల్ కాంగ్రెస్ నేతలు తమ ప్రాంతానికి కూడా మెట్రో రైలు విస్తరించాలని సీఎంకు వినతి ఇవ్వడం, అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో మేడ్చల్ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సరం రోజు హైదరాబాద్ నుంచి మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేటకు పొడిగించాలని అధికార ప్రకటన చేశారు. దీంతో నగరానికి ఉత్తర భాగంలోని ప్రాంతాలు మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నాయి. ప్యారడైజ్ నుంచి తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు 23 కి.మీ, జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట వరకు 22 కి.మీ వరకు రెండు కొత్త కారిడార్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్‌లు సిద్దం చేసి కేంద్రానికి పంపించాలని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఉత్తర తెలంగాణాకు అనుసంధానం
నార్త్ సిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నార్త్ సిటీకి మెట్రోను విస్తరించాలని కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఫోర్త్ సిటీకి మెట్రో లైన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించినప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నార్త్ సిటీ వైపునకు మెట్రో ఎందుకు విస్తరించరనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు నార్త్ సిటీ వైపునకు కూడా మెట్రో విస్తరించేందకు ప్రభుత్వం ఆమోదించింది. ఉత్తర తెలంగాణాకు నగరానికి కనెక్టివిటీగా ఉన్న జాతీయ రహదారులు 44, రాజీవ్ రహదారిలు మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాల మీదుగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన ప్రజలు వేలాది సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో విస్తరిస్తే నార్త్ సిటీ మరింత అభివృద్ధి చెంది, ప్రజలకు సౌకర్యవంతంగా మారనుంది.
గ్రేటర్ పరిధిలో కలిసే అవకాశం
మేడ్చల్ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలతో పాటు పరిశ్రమలు, వివిధ రకాల కంపెనీలు ఉన్న దృష్ట్యా మెట్రో విస్తరణ జరిగితే వేలాది మంది ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్‌తో అనుసంధానించబడుతాయి. గతంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మల్కాజిగిరి ప్రజలకు ఏదో ఒకటి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే మెట్రో విస్తరణకు ఆదేశించడం పట్ల ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరుగులు పెట్టనున్న అభివృద్ధి
మేడ్చల్, శామీర్‌పేటకు మెట్రో విస్తరణతో నార్త్ సిటీవైపు రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని రియల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందిన నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణ జరిగితే మరింత అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు కండ్లకోయలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ నిర్మాణం కూడా పూర్తయితే నార్త్ సిటీ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు నూతన సంవత్సర వేళ ప్రభుత్వం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు మెట్రో విస్తరణతో తీపి కబురు అందించింది.
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో రైలు విస్తరణ పూర్తయితే నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి. ప్రతీ రోజు వేలాది మంది ఈ ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో ఎన్‌హెచ్-44, రాజీవ్‌రహదారిలు ట్రాఫిక్‌తో రద్దీగా మారుతుంటాయి. దీనికితోడు ప్రస్తుతం ఎన్‌హెచ్-44లో బ్రిడ్జిల నిర్మాణ పనులు, శామీర్‌పేట రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం భూ సేకరణ పనులు జోరుగా జరుగుతున్నాయి. దీంతో గత కొంత కాలంగా మేడ్చల్, శామీర్‌పేట రహదారులు వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మెట్రో విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.