ఉగాది నుంచి సన్నబియ్యం
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:15 AM
రానున్న ఉగాది నుంచి పౌర సరఫరాల దుకాణాలలో సన్నబియ్యం ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సును రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రంగారెడ్డి అర్బన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రానున్న ఉగాది నుంచి పౌర సరఫరాల దుకాణాలలో సన్నబియ్యం ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సును రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి, మున్సిపల్ స్థాయిలో పర్యటించే బృందంలో వ్యవసాయ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ప్రతినిధులు తప్పని సరిగా ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా రూ.12 వేలు అందజేస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇవ్వాలన్నారు. శాసన సభ్యులు సూచించిన విధంగా అర్బన్, రూరల్ ప్రాంతంలో గాని ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే రెండో విడతలో రాజీవ్ స్వగృహ మాదిరిగా 10 అంతస్తుల భవన సముదాయం నిర్మించి ఇల్లులేని వారికి అందజేస్తామన్నారు.2014 జీవో ప్రకారం అర్హులను ఎంపిక చేసి రేషన్ కార్డులు అందజేయాలన్నారు. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.
సంక్షేమ పథకాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి లబ్ధి
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి లబ్ధిచేకూరేలా చూడాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు లబ్ధిచేకూరేలా ఎంపిక జరగాలని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేల సూచనలు, అభిప్రాయాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలన్నారు. ఈ నాలుగు పథకాల అమలుపై గ్రామ, మున్సిపల్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి లిస్టులను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామసభలు నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల్లో దండోరా వేయించాలన్నారు.
పథకాల అమలుకు షెడ్యూల్ రెడీ
: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నాలుగు పథకాలకు సంబంధించి ఈనెల 11నుంచి 13 వరకు షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, 16 నుంచి 20 వరకు ఆయా శాఖల బృందాలు లబ్ధిదారులలో అర్హులను గుర్తించి 21 నుంచి 24వ తేదీ వరకు ఆయా గ్రామసభల్లో మున్సిపల్ వార్డులలో జాబితాను ఉంచడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసాలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ యోగ్యం భూములను గుర్తించాలని, కొత్త రేషన్ కార్డులు ఎంపికలు బృందాలుగా వెళ్లి నిజమైన అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిలో2023-24 సంవత్సరంలో జాబ్ కార్డులు కలిగిన వారిని ఎంపిక చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు శాసన సభ్యులు కొంత మంది రైతులకు రుణమాఫీ రాలేదని, సన్నబియ్యం బోనస్ 500 రూపాయలు కొన్ని ప్రాంతాలలో బ్యాంకుల నుండి రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే లీడ్ బ్యాంక్ అధికారికి వివరాలు ఇచ్చి ఆ రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగారపు దయానంద్, శాసన సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, అరికె పూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమీషనర్ కె.శశంక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మూడు జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.