శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటాం
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:16 PM
ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధి రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్యకు గురైన కొంగర నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఇబ్రహీంపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధి రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్యకు గురైన కొంగర నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం గ్రామంలో శ్రీకాంత్ అతని తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యలను పరామర్శించి ఏసీపీ కేపీవీ రాజు ద్వారా కేసు వివరాలు తెలుసుకున్నారు. కులాంతర వివాహం చేసుకుందని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని గతేడాది డిసెంబరు 2న రాయపోల్- మాన్యగూడలో రోడ్డులో సొంత తమ్ముడు పరమేష్ వేట కొడవలితో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా పరమే్‌షతోపాటు అతనికి సహకరించిన అచ్చన్న, శివ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కాగా, ఈ హత్యకు మరికొందరు సహకరించారని, వారిని అరెస్టుచేసి విచారణ జరిపించాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ... శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకునేలా చూస్తామని ఆయన అన్నారు. వీరికి కేవలం 25 గుంటల భూమి మాత్రమే ఉందని, ప్రభుత్వ పరంగా మరికొంత భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డిని కోరారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా చివరి వారంలో పౌర హక్కుల దినంగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి చట్టాలపై అవగాహన కల్పించాలని తహసీల్దారు సునీతారెడ్డికి సూచించారు. ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు పోలీస్ కమిషనర్లకు లేఖ రాయన్నుట్లు ఆయన చెప్పారు.
నిందితులను పోలీస్ కస్టడీకి కోరాం
నాగమణి హత్య కేసులో ఎ-1 గా ఉన్న పరమే్‌షను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టులో పిటిషన్ వేశామని ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. న్యాయ సలహా అనంతరం రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు సూచనల మేరకు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎ-1 పరమేష్, ఎ-2 శివల మధ్య ఫోన్‌పే లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అంతేగాక ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు స్పెషల్ కోర్టుకు అప్పగించే విషయమై కోర్టుకు నివేదించినట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటనలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంట దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన ఉన్నారు.
ప్రధానోపాధ్యాయునిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
మహేశ్వరం : తుక్కుగూడ మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు రాములుపై అయ్యప్ప స్వాముల ముసుగులో దాడి జరిగి 15 రోజులు కావొస్తున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన తుక్కుగూడ పాఠశాలను సందర్శించిన బాధిత ప్రధానోపాధ్యాయుడిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిఽధంగా మహేశ్వరం ఏసీపీ లక్ష్మికాంత్‌రెడ్డితో మాట్లాడి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు.