Share News

పండగపూట.. ధరల మంట

ABN , Publish Date - Jan 12 , 2025 | 02:00 AM

పండగపూట నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు గుర్తొస్తాయి. పండుగపూట ఏ వస్తువు ముట్టుకున్నా ధరలు మండుటుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి. సరుకులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ పిండి వంటల సంప్రదాయాన్ని వదులుకోలేక తక్కువ మొత్తంలో పిండి వంటలను చేసుకుంటున్నారు.

పండగపూట.. ధరల మంట

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పండగపూట నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు గుర్తొస్తాయి. పండుగపూట ఏ వస్తువు ముట్టుకున్నా ధరలు మండుటుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి. సరుకులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ పిండి వంటల సంప్రదాయాన్ని వదులుకోలేక తక్కువ మొత్తంలో పిండి వంటలను చేసుకుంటున్నారు.

పప్పులు, నువ్వుల ధరలు

పిండి వంటలకు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగిపోయాయి. శెనగపప్సు కిలో రూ.100, కందిపప్పు రూ.165, మినపపప్పు రూ.160, పెసరపప్పు రూ.130 చొప్పున ధరలు పలుకుతున్నాయి. సకినాలు, గారెల్లో వాడే నువ్వులు రూ.195, పల్లీలు రూ.130, అరిసెలకు ఉపయోగించే బెల్లం రూ.75 ధర పలుకుతుండడంతో కొనుగోళ్లు తగ్గించుకున్నారు.

మరుగుతున్న వంట నూనె

ఏ వంటైనా నూనెతోనే మొదలవుతోంది. అలాంటిది సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలకు ఎక్కువగా నూనెనే ఉపయోగించాల్సి ఉంటుంది. పేదవాళ్ల నుంచి ధనికుల వరకు అందరూ వాడే నూనెలు బ్రాండెడ్‌ మినహా అంతా సమానమే. ప్రస్థుతం పండుగల సందర్భంగా నూనె ధర సల సల మరుగుతోంది. పల్లి నూనె కిలో రూ.150 ఉండగా సన్‌ఫ్లవర్‌ నూనె రూ.140, పామాయిల్‌ రూ.95 నుంచి రూ.120 వరకు పెరిగింది. లోకల్‌ కంపెనీల నూనెలు పది రూపాయల వరకు పెంచారు. నూనెలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

తగ్గని వెల్లుల్లి ఘాటు

తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో కురిసిన వర్షాల ప్రభావంతో వెల్లుల్లి, ఉల్లి ఘాటు తగ్గడం లేదు. వెలుల్లి కిలో రూ. 280 నుంచి 320 వరకు ధర పలుకుతోంది. ఉల్లి ధర తెల్లరకం కిలో రూ.40, ఎర్ర రకం రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధానంగా ఉల్లిగడ్డలు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా అవుతాయి. అక్కడ తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఘుమఘుమలాడుతున్న పిండి వంటలు

జిల్లాలోని ప్రతీ ఇంటా సంక్రాంతి ప్రత్యేక వంటకాలతో ఘుమఘుమలాడుతున్నాయి. సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి సంబరాలను తెస్తుంది. పిండి వంటలకు ప్రత్యేకం. చిన్న పెద్ద తేడా లేకుండా సకినాలు, గారెలు, అరిసెలు, ఇలా ఎన్నో ఇష్టపడి తింటారు. బియ్యపు పిండి ప్రధాన ముడిసరుకుగా కరకరలాడే సకినాలు ముఖ్యమైనవి. వీటితోపాటు గారెలు, అరిసెలు, గరిజలు, మురుకులు, చేగోడిలు, లడ్డూలు, పూస, చెక్కెర పల్లీలు, ఇలా ఎన్నో పిండివంటల తయారీ మహిళలు బిజీగా ఉన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 02:00 AM