Share News

Srisailam: ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న ఆపరేషన్‌

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:20 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Srisailam: ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న ఆపరేషన్‌

  • సొరంగంలోకి 30 హెచ్‌పీ లిక్విడ్‌ వాక్యూమ్‌ పంపు, ట్యాంక్‌

దోమలపెంట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్‌కర్నూలు కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో వివిధ రెస్క్యూ బృందాలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గత నెల 22న ప్రమాదం జరిగిన నాటి నుంచి రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం నాటికి 21 రోజులైనా ఇంకా ఏడుగురు కార్మికుల జాడ గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్న డీ1, డీ2, ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు పనులు చేపడుతున్నాయి. టీబీఎం మిషన్‌ ఎర్త్‌ కట్టర్‌ ఉన్న ప్రాంతం పూర్తిగా 30 అడుగుల వరకు కూరుకుపోయింది. అక్కడి వరకు మనుషులు వెళ్లి పనులు చే యడం చాలా ప్రమాదకర ంగా ఉంది.


ఇక్కడ టీబీఎంకు సంబంధించిన విడిభాగాలు కటింగ్‌ చేసి తొలగిస్తున్నారు. అక్కడ సిమెంట్‌ సెగ్మెంట్‌ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నందున సింగరేణి గనుల్లో ఉపయోగించే టైగర్‌ క్లాగ్స్‌ను సపోర్టుగా చేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో మనుషులు వెళ్లలేని ప్రమాదకమైన ప్రాంతాల్లో రోబోలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన ఆన్వి రోబోలను తెప్పించింది. కానీ ఇప్పటివరకు వాటి సేవలు అందుబాటులోకి రాలేదు. అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబోలకు అనుసంధానంగా ప్రత్యేకంగా ఉపయోగించేందుకు 30 హెచ్‌పీ సామర్థ్యం గల పంపు మోటారు, వాక్యూమ్‌ ట్యాంకుతో కూడిన మిషన్‌ను సొరంగంలోకి పంపారు. రోబోతో తవ్వకాలతో పనులు వేగంగా జరుగుతాయని, వాక్యూమ్‌ ట్యాంకు ద్వారా గంటకు 620 క్యూబిక్‌ మీటర్ల బురద మట్టిని కన్వేయర్‌, బెల్ట్‌పై బయటకు తరలించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 05:20 AM