ఇంకా లభ్యం కాని ఏడు మృతదేహాలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:36 AM
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం తర్వాత.. 23 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ఇంకా ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వలేదు.

ఎస్‌ఎల్‌బీసీలో 23 రోజులుగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్న రెస్క్యూ కార్మికులు
దోమలపెంట, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం తర్వాత.. 23 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ఇంకా ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వలేదు. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. గత వారం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహాన్ని వెలికి తీసిన విషయం తెలిసిందే..! మిగతా మృతదేహాల కోసం ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, రైల్వే, హైడ్రా, అన్వి రోబో టెక్ తదితర 12 బృందాలు, కాడవర్ డాగ్స్ నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం డీ-2 ప్రాంతంలో పూర్తిగా ఐరన్ ప్లేట్లు, టీబీఎం విడిభాగాలు, తెగిపోయిన కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగించారు. దాంతో ఎక్స్‌కవేటర్ అక్కడిదాకా వెళ్లి, మట్టి శిథిలాలను తొలగించగలుగుతోంది. అయితే.. డీ-1 ప్రాంతంలో దాదాపు 20 అడుగుల మేర మట్టి, బురద, రాళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో సెగ్మెంట్ బ్లాకులు దెబ్బతిని, నెర్రెలు బారాయి. దీంతో.. మరో ప్రమాదం జరగకుండా ఉండేందుకు సింగరేణి గనుల్లో వినియోగించే టైగర్‌క్లాక్స్‌ను సొరంగం పైకప్పునకు సపోర్టుగా పెట్టారు. నీటి ఊట ఏమాత్రం తగ్గడం లేదని, సొరంగం పైకప్పులను అనుక్షణం గమనిస్తూ సహాయక బృందాలు పనిచేస్తున్నాయని సింగరేణి జీఎం బైద్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు కార్మికులు అధికారులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నారు. దీంతో కలెక్టర్ సంతోష్ ఆదివారం ఎస్‌ఎల్‌బీసీకి చేరుకున్నారు. కార్మికులను కలిసి మాట్లాడారు. వారికి అందుతున్న భోజనం, వసతి తదితర సదుపాయాలను గురించి అడిగి, తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.