Share News

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీలో కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:22 AM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన వారి జాడను కనుగొనేందుకు సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బుధవారం కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించడంతో సొరంగం లోపల పేరుకుపోయిన మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఏర్పడింది.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీలో కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ

  • టన్నెల్‌లో మట్టిని వేగంగా తరలించేందుకు అవకాశం

నాగర్‌కర్నూల్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన వారి జాడను కనుగొనేందుకు సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బుధవారం కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించడంతో సొరంగం లోపల పేరుకుపోయిన మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఏర్పడింది. ఏడుగురి ఆచూకీ కోసం 18 విభాగాలకు చెందిన 703 మంది సిబ్బంది 24 గంటలు శ్రమిస్తున్నారు. షీర్‌ జోన్‌లో దాదాపు 5 వేల టన్నుల మట్టి, రాళ్లు ఉండగా ఇప్పటి వరకు లోకో ట్రైన్‌ ద్వారా 800 క్యూబిక్‌ మీటర్ల మట్టిని, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం విడి భాగాలను బయటకు తీసుకురాగలిగారు.


ఈ ప్రక్రియ ఇదే స్థాయిలో కొనసాగితే మరో వారం లోపల మట్టి దిబ్బలు, రాళ్లను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఆర్మీ, నేవీ విభాగాలకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఎండలు బాగా ముదిరిన నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగినా దాన్ని అధిగమించేందుకు కలెక్టర్‌, ఎస్పీ తగిన చర్యలు తీసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన పోషకాహారం అందించడంతో పాటు ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 05:22 AM