AI City: ఉగాది తర్వాత ‘ఏఐ సిటీ’కి భూమి పూజ
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:56 AM
ఉగాది తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

మహేశ్వరంలో 200 ఎకరాల్లో నిర్మాణం: శ్రీధర్ బాబు
‘క్లియర్ టెల్లిజెన్స్’ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉగాది తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ‘ఏఐ సిటీ’ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం ‘క్లియర్ టెల్లిజెన్స్’ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామని చెప్పారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీ్‌సలో తెలంగాణ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.
డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ్‌సలో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే ‘క్వాంటం కంప్యూటింగ్’నూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఎదిగితే.. రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతిభ గల యువతే తెలంగాణకున్న అతి పెద్ద ఆస్తి అని పేర్కొన్నారు. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారాలను కనుక్కునేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.