Share News

Nagarjuna Sagar Project : తెలంగాణకు నాగార్జునసాగర్‌ జీవనాడి

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:13 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని, ఆ ప్రాజెక్టును కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులకు

Nagarjuna Sagar Project : తెలంగాణకు నాగార్జునసాగర్‌ జీవనాడి

డ్యామ్‌ స్పిల్‌వేపై ఐఐటీ రూర్కీతో అధ్యయనం

నివేదిక ఆధారంగా గుంతల పూడ్చివేత: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని, ఆ ప్రాజెక్టును కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జలసౌధలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై మాజీ మంత్రి కె.జానారెడ్డి, నల్లగొండ ఎంపీ కె.రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ స్పిల్‌వే ఓగిపై ఏటా వరదల సమయంలో గుంతలు పడుతున్నాయని అధికారులు గుర్తు చేయగా.. మంత్రి స్పందించారు. స్పిల్‌వే గుంతలపై రూర్కీ ఐఐటీతో అధ్యయనం చేయించాలని, ఆ తర్వాత సిఫారసుల ఆధారంగా గుంతలు పూడ్చటానికి చర్యలు తీసుకోవాలని, కట్టను కాపాడుకోవడానికి వీలుగా చర్యలకు ఉపక్రమించాలన్నారు. సాగర్‌ డ్యామ్‌తో పాటు కాలువల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) లిఫ్టుల కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉందని, ఆ లిఫ్టులన్నింటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి, పూర్తి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రూ.664 కోట్ల వ్యయంతో సాగర్‌ జలాశయం నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన నెల్లికల్‌ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టాలని, రానున్న ఖరీఫ్‌ నాటికి 7600 ఎకరాలను ఫేజ్‌-1 కింద అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌ ప్రాజెక్టులోని లో లెవల్‌ కెనాల్‌ లైనింగ్‌ చేపట్టాలని, 90.43 కిలోమీటర్లు ఉన్న కెనాల్‌కు 60 మిల్లీమీటర్ల మందంతో సీసీ లైనింగ్‌ పనులు చేపట్టాలని, డిస్ట్రిబ్యూటరీలకు కూడా మరమ్మతులు చేయాలని సూచించారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లో 30 వేల ఎకరాలను స్థిరీకరించడానికి వీలుగా 19 చిన్న లిఫ్టుల పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

Updated Date - Jan 08 , 2025 | 04:13 AM