Share News

GHMC: జీహెచ్‌ఎంసీలో ‘బిల్డ్‌ నౌ’ షురూ

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:58 AM

భవన నిర్మాణ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘బిల్డ్‌ నౌ’ సేవలు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో అందుబాటులోకి వచ్చాయి.

GHMC: జీహెచ్‌ఎంసీలో ‘బిల్డ్‌ నౌ’ షురూ

  • అధికారులకు లాగిన్‌, పాస్‌వర్డ్‌ అందజేత

  • హెచ్‌ఎండీఏలో ఏప్రిల్‌ మొదటి వారంలో.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘బిల్డ్‌ నౌ’ సేవలు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో అందుబాటులోకి వచ్చాయి. అధునాతన విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని శుక్రవారం నుంచి కల్పించారు. విస్తరిత హెచ్‌ఎండీఏలో ఏప్రిల్‌ మొదటి వారంలో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చిన దృష్ట్యా.. జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులకు శుక్రవారం లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే విధానంలో సులభతర భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం బిల్డ్‌ నౌ సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్యులఇంటి నుంచి ఆకాశ హర్మ్యాల వరకు బిల్డ్‌ నౌలో సులువుగా అనుమతులు పొందవచ్చు. గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్‌లు/స్ట్రక్చరల్‌ ఇంజనీర్ల ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


‘మహా’ విస్తరణ అనుమతులు హెచ్‌ఎండీఏకే!

హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి 10,474 చదరపు కిలోమీటర్లకు విస్తరించగా అందులో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. విస్తరించిన ప్రాంతంలో ప్రస్తుతం డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతులిస్తుండగా.. ఇకపై హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చేలా చర్యలు చేపట్టారు. హెచ్‌ఎండీఏను విస్తరిస్తూ ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. ఆ రోజు నుంచి విస్తరణ ప్రాంతంలోని దరఖాస్తులన్నీ హెచ్‌ఎండీఏ పరిష్కారం చేయనుంది. అంతకంటే ముందు దరఖాస్తులను డీటీసీపీ పరిష్కరించనుంది. అయితే భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల కోసం తీసుకొచ్చిన బిల్డ్‌ నౌ అప్లికేషన్‌లో హెచ్‌ఎండీఏ విస్తరించిన పరిధి మొత్తాన్నీ చేర్చేవిధంగా సాంకేతిక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.

Updated Date - Mar 22 , 2025 | 03:58 AM