Elevated Corridor : శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు 7,668 కోట్లు
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:09 AM
తెలంగాణ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏపీలోని శ్రీశైల క్షేత్రానికి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ కోసం అలైన్‌మెంట్ సిద్ధమైంది. దీన్ని తెలంగాణ విభాగానికి జాతీయ రహదారులు,
కేంద్రానికి అలైన్‌మెంట్ నివేదికలో ప్రతిపాదన
కారిడార్ నిర్మాణంతో తగ్గనున్న దూరం, సమయం
మన్ననూర్ నుంచి పాతాళగంగ దాకా 55 కి.మీ మేర కారిడార్
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏపీలోని శ్రీశైల క్షేత్రానికి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ కోసం అలైన్‌మెంట్ సిద్ధమైంది. దీన్ని తెలంగాణ విభాగానికి జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ అందించగా.. దీనిపై అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు అలైన్‌మెంట్‌ను తాజాగా కేంద్రానికి నివేదించారు. మొత్తం 36 పేజీలతో కూడిన ఆ నివేదికలో రహదారి స్వరూపం, టోల్‌ప్లాజ్‌లు, బైపా్‌సలు, గ్రామాలు ఉన్న చోట నిర్మించతలపెట్టిన ర్యాంపులు, ఘాట్‌రోడ్డులో చేపట్టే రోడ్డు నిర్మాణాలతో కలిపి రూ.7,668 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్జ్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపడితే లాభదాయకంగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం ఆమోదం తెలిపితే, డీపీఆర్‌ను ఖరారు చేసి.. వచ్చేఆర్థిక సంవత్సరం ( 2025-26)లో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఈ రహదారి పూర్తయి, అందుబాటులోకొస్తే శ్రీశైల క్షేత్రానికి ప్రయాణదూరం, సమయం తగ్గుతాయి. కాగా తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల 765 జాతీయ రహదారే ఆధారం. ప్రస్తుతం ఈ రోడ్డు హైదరాబాద్‌లోని తుక్కుగూడ జంక్షన్ నుంచి మనగల్లు, డిండి, మన్ననూర్ మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలోనే పాతాళగంగ దగ్గర తెలంగాణ సరిహద్దు ముగుస్తుంది. అక్కడే శ్రీశైలం మల్లన్న క్షేత్రం ఉంది. మల్లన్న దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు కూడా వెళ్తుంటారు. వారంతా ఇప్పుడున్న మార్గం గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుత రోడ్డు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తుండటంతో ఈ మార్గంలో మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి రాత్రి 9- ఉదయం 6 మధ్య ప్రయాణాలకు అవకాశం ఇవ్వడం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కారిడార్ ఇలా..
ఎలివేటెడ్ కారిడార్.. మన్ననూర్ చెక్‌పోస్టుకు కొంచెంముందు.. బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై.. ఈగలపెంట తర్వాత ముగుస్తుంది. ఈ మధ్యలో మన్ననూర్, వట్టర్‌పల్లి దగ్గర రెండు బైపా్‌సలను, ఆ తర్వాత దోమలపెంట, ఈగలపెంట గ్రామాలు ఉండటంతో అక్కడ కారిడార్ ఎక్కిదిగేందుకు వీలుగా రెండువైపులా ర్యాంపులను నిర్మిస్తారు. మధ్యలో ఒకచోట టోల్‌ప్లాజా, రెస్ట్ ఏరియాలను ఏర్పాటుచేయనున్నారు. మన్ననూర్ దాటాక వరుసగా వచ్చే 5-6 మలుపులను 3-4కు కుదించనున్నారు. ఘాట్ రోడ్డు దగ్గర ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టనుండగా.., ఏపీ సరిహద్దు వచ్చే దగ్గర కృష్ణానదికి కొంచెం పక్కనుంచి ఈ ఎలివేటెడ్ కారిడార్ వెళ్లనుంది. మొత్తంగా కారిడార్, ర్యాంపులు, బైపా్‌సలు కలిపి మొత్తం 55 కి.మీ మేర ఉంటుంది. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 45.42 కి.మీ మేర ఉండగా.. మరో 9.49కి.మీ మేర రోడ్డు ప్రస్తుతం ఉన్న రహదారి మీదుగా ఉండనుంది. రెండు బైపా్‌సలు 6.05కి.మీ దూరంతో ఉంటాయి. ఈ రోడ్డు ఒక కి.మీ నిర్మాణానికి రూ.115కోట్లు వెచ్చించనున్నారు. ప్రాజెక్టు మొత్తానికి రూ.7,668 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇందులో ఎలివేటెడ్ కారిడార్, ఎక్కిదిగే ర్యాంపులు కలిపి 47.82 కి.మీ ఉండగా.. వీటికి రూ.5,500 కోట్లు అవసరపడతాయి. ఘాట్ రోడ్డులో నిర్మాణంతో పాటు, రహదారుల వెడల్పు 3.50కి.మీ ఉండగా.. దీనికి రూ.175కోట్లు, మరోచోట ఉన్న ఘాట్ రోడ్డు సెక్షన్ కోసం రూ.90కోట్లు, ప్రస్తుతం ఉన్న రహదారికి సమాంతరంగా నిర్మించే మరో రోడ్డుకు రూ.195 కోట్లు కావాల్సి ఉందని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పొందుపర్చారు. రహదారి భద్రతకు రూ.15.1కోట్లు, నిర్వహణ ఖర్చులకు రూ.302.5కోట్లు, యుటిలిటీ చార్జీలు రూ.60 కోట్లు, భూ సేకరణ నేపథ్యంలో అటవీ చార్జీల కింద రూ.181.5కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. కాగా ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రస్తుతం ఉన్న రోడ్డు నుంచి 20-25 అడుగుల ఎత్తులో నిర్మించనున్నట్టు తెలిసింది. కారిడార్, మధ్యమధ్యలో నిర్మించే రోడ్లన్నింటికీ కలిపి మొత్తం 147.31 హెక్టార్ల భూమి కావాల్సి ఉంది. ఇందులో 128.62 హెక్టార్ల మేర అటవీ భూములుండగా, 18.68హెక్టార్ల మేర అటవీయేతర భూములున్నాయి. వీటిలో ఎలివేటెడ్ కారిడార్ కోసమే దాదాపు 91.179 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. ఎక్కిదిగే ర్యాంపులకు 2.20 హెక్టార్లు, బైపాస్ రోడ్ల నిర్మాణాలకు 14.87 హెక్టార్లు, ప్రస్తుతమున్న రోడ్లపై నిర్మాణాలకు 11.77 హెక్టార్లు, సవరించిన అలైన్‌మెంట్ ప్రకారం ఘాట్ రోడ్డులో నిర్మాణానికి 9.810హెక్టార్లు, మరికొన్ని చోట్ల ఉన్న ఘాట్ రోడ్ల వెడల్పునకు 12.987హెక్టార్ల భూమి అవసరంపడుతుందని నివేదికలో పొందుపర్చారు.