Share News

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ రచ్చలోకి అగ్ర నటులు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:53 AM

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్ర నటులు వచ్చి చేరారు. ఈ మేరకు సినీనటులు బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌పై సైబర్‌ క్రైం విభాగానికి ఆన్‌లైన్‌లో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఫిర్యాదు చేశారు.

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ రచ్చలోకి అగ్ర నటులు

  • బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌పై సైబర్‌ క్రైం విభాగానికి న్యాయవాది ఫిర్యాదు

  • ఫన్‌-88యా్‌పను ప్రమోట్‌ చేశారని ఆరోపణ.. రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్స్‌పై 385 ఫిర్యాదులు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్ర నటులు వచ్చి చేరారు. ఈ మేరకు సినీనటులు బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌పై సైబర్‌ క్రైం విభాగానికి ఆన్‌లైన్‌లో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ, తొట్టెంపూడి గోపీచంద్‌, ఉప్పలపాటి వెంకటసూర్యనారాయణ రాజు అలియాస్‌ ప్రభాస్‌ చైనీస్‌ బెట్టింగ్‌ యాప్‌ అయిన ఫన్‌-88ను ప్రమోట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాప్‌ నిర్వాహకులు మ్యూల్‌ (ఇతరుల ఆధార్‌ నంబర్లతో వారికి తెలియకుండానే తీసుకున్న) ఖాతాల ద్వారా కోట్లాది రూపాయలను చైనాకు తరలించారని వివరించారు. దేశ భద్రతకే సవాల్‌గా మారిన ఫన్‌-88 బెట్టింగ్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోనే ఉందని, దాన్ని వెంటనే బ్లాక్‌ చేయాలని రామారావు కోరారు. కాగా, బెట్టింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్లపై రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లు, సైబర్‌ క్రైం, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల్లో ఇప్పటిదాకా 385 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లలో పాల్గొన్న వారికి నోటీసులు ఇచ్చి విచారించడానికి ముందు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి స్టేషన్‌హౌ్‌స ఆఫీసర్లకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.


ఆత్మహత్య కేసులను రీఓపెన్‌ చేసి, ఆయా మరణాలకు ఏయే బెట్టింగ్‌ యాప్స్‌ కారణం? ఎవరెవరు ఆ యాప్‌లను ప్రమోట్‌ చేశారు? అనే విషయాలను ధ్రువీకరించుకుని, అన్నింటినీ ఆ కేసుకు జతపర్చాలని సూచించినట్లు సమాచారం. కాగా, బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా వేల కోట్ల రూపాయల దంతా సాగుతోందని, ఇందులో అధిక శాతం వాటా చైనా కంపెనీలదేనని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు ఉన్న భారతీయ కంపెనీలు 28శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లించని గేమింగ్‌ యాప్స్‌ సంస్థలపై ఇటీవల జీఎస్టీ ట్యాక్స్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు కొరడా ఝలిపించారు. 357 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌చేశారు. మరోవైపు రాష్ట్రంలో జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీ ద్వారా బెట్టింగ్‌ సైట్లు యాక్సెస్‌ కాకుండా అడ్డుకోవడానికి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడంతోపాటు 133భారతీయ బెట్టింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్‌ యాప్‌ల గురించి ఎలాంటి సమాచారం లేదా ఫిర్యాదు ఉన్నా 87126 72222 వాట్సాప్‌ నంబర్‌కు పంపించాలని సైబర్‌ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 24 , 2025 | 03:53 AM