Share News

భువనగిరిలో టెన్షన్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:09 AM

: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.

భువనగిరిలో టెన్షన్‌.. టెన్షన్‌
కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

బీఆర్‌ఎస్‌ యాదాద్రిభువనగిరి జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

భువనగిరి టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆయన శనివారం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎంను అసమర్థుడు, రండ అంటూ పదే పదే మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆగ్రహించిన యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనగా వెళ్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసే వరకు ఆంధోళనలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సీఎం, ఆ పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు రైతుభరోసా, కల్యాణ లక్ష్మీ పథకంలో తులం బంగారం, బాలికలకు స్కూటీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు తదితర ఎన్నికల హామీలేవీ ఏడాది గడుస్తున్నా నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలను అవినీతిపరులని ప్రచారం చేసిన ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అనుమతులు లేని వెంచర్ల ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన ఫిర్యాదులతో యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ర్టార్‌ సస్పెండ్‌ అయ్యారని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ ప్రతి రోజూ జాజిరెడ్డిగూడెం పరిసరాల్లోని వాగు నుంచి రోజుకు 400 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ను రండ అన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డియే అసలైన రండ, అసమర్థుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాక కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను ఉటంకిస్తూ సీఎంను పదే పదే రండ అంటూ వ్యాఖ్యానించారు. రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆగ్రహించిన యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగ ప్రవీణ్‌, వస్తువుల సాయి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై అకస్మాత్తుగా దాడికి దిగి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి బీఆర్‌ఎస్‌ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను పరిశీలించి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి వెంటఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీలు, జెండాలను చించివేశారు. సీఎం ఫ్లెక్సీని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైఠాయించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి దోషులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దాడులతో బీఆర్‌ఎస్‌ కార్యర్తలను, నాయకులను భయపెట్టలేరని, సీఎం రేవంత్‌రెడ్డి ఖబడ్దార్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిరగబడితే కాంగ్రెస్‌ కార్యకర్తలెవరూ రోడ్లపై తిరగరని అన్నారు. చేతనైతే ఎన్నికల హామీలను నెరవేర్చాలి కానీ ప్రశ్నించే వారి గొంతుకను మూయవద్దన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అణిచివేయబడిన భువనగిరిలోని కొన్ని అరాచక శక్తులు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే విజృంభిస్తున్న పరిణామాలను పోలీసులు గ్రహించాలన్నారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రైతు బంధు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మునిసిపల్‌ మాజీ చైర్మన్లు కొలుపుల అమరేందర్‌, డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, ఎనబోయిన ఆంజనేయులు, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ, కేశవపట్నం రమేష్‌, ఏవి కిరణ్‌కుమార్‌, జనగాం పాండు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం

భువనగిరి గంజ్‌, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామని సీపీఎం యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజమన్నారు. ఆయా సందర్భాల్లో పాలకులు చేస్తున్న పనులపైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటాయని, ఆ సందర్భంలో తప్పు పదాలు మాట్లాడితే తప్పును ఎత్తి చూపేలా ఉండాలి కాని దాడులు చేసి గాయపరిచేలా ఉండకూడదని ఆయన సూచించారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి ఇంటి వద్ద పోలీస్‌ బందోబస్తు

మోత్కూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ యాదాద్రి భువన గిరి జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలోని ఆయన ఇంటి వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామన్నపేట సీఐ ఎన్‌. వెంకటేశ్వర్లు, మోత్కూరు ఎస్‌ఐ డి. నాగరాజు నేతృత్వంతో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద లేరని, హైదరాబాద్‌లో ఉన్నారని తెలిసింది.

Updated Date - Jan 12 , 2025 | 01:09 AM