Share News

ఉధృతంగా పారుతున్న‘గంధమల్ల’ మత్తడి

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:37 AM

మండలంలోని గంధమల్ల చెరువు మత్తడి ఉధృతంగా పారుతుండడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లె రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఉధృతంగా పారుతున్న‘గంధమల్ల’ మత్తడి

వారం రోజులుగా నిలిపోయిన రాకపోకలు

పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులు

తుర్కపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంధమల్ల చెరువు మత్తడి ఉధృతంగా పారుతుండడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లె రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండు నెలలుగా మల్లన్న సాగర్‌ నుంచి గోదావరి జలాలను గందమల్ల చెరువుకు మళ్లించి ఆలేరు, తుంగతుర్తి నియోజక వర్గాల్లోని పలు గొలుసు కట్టు చెరువులను గోదావరి జలాలను నింపి రైతాంగానికి సాగు నీరు అందిస్తున్నారు. మల్లన్న సాగర్‌ నుంచి 10 రోజులుగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో చెరువు మత్తడి కింద ఏర్పాటు చేసిన బ్రిడ్జ్‌పై నుంచి నీటి వరద ఉధృతంగా పారుతోంది. దీంతో గంధమల్ల గ్రామస్థులు, వ్యవసాయ రైతులతో పాటు రాజాపేట మండలం నర్సాపూర్‌, పుట్టగూడెం, బేగంపేట మండలంలోని ఎనజి బండలు, కోనాపూర్‌, ఇబ్రహీంపూర్‌ తదితర గ్రామాల ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు నిలిపోయాయి. మత్తడి ఉధృతంగా పారుతుండడంతో ఆయా గ్రామాల ప్రయాణికులు ఆ వైపు వెళ్లడడం లేదు. కానీ రైతులు మాత్రం మరో మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 50వ్యవసాయ బావులకు చెందిన రైతులు గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి వెళ్లి రైతుల పొలం గట్ల పై నుంచి కాలి నడుకన వెళ్తున్నారు. ఉదయం సాయంత్రం పాడి రైతులు కాలి నడకన వెళ్లి పాలు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బావుల వద్దకు వెళ్లలేకపోతున్న రైతులు

గ్రామంలోని సాపోర్‌ మైసమ్మ గుడి వైపు ఉన్న బావులు, వీరారెడ్డిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బావుల రైతులు చెరువు ఎగువ ప్రాంతంలో ఉన్న వాగుపై చిన్నచిన్న పైపులతో తమ బావుల వద్దకు వెళ్లెందుకు రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం గోదావరి జలాల నీటి ప్రవాహం ఎక్కువై ఉధృతంగా ప్రవహించడంతో రైతులు వేసుకొన్న రోడ్డు కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. ఈ బావుల వద్దకు వెళ్లే రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రైతులు తలా ఇన్ని డబ్బులు వేసుకుని రోడ్డు మరమ్మతు పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి కల్వర్టు ఏర్పాటు చేసి, ఈ బావుల వద్దకు వెళ్లేందుకు రోడ్డు వేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వరద ప్రవాహానికి బ్రిడ్జి సరిపోవడం లేదు

చెరువు కింది భాగంలో రెండు దశాబ్దాలు క్రితం ఏర్పాటు చేసి బ్రిడ్జి శిఽథిలావస్థలో ఉండడమే కాకుండా మత్తడి నుంచి వచ్చే వరద ప్రవాహానికి ఈ బ్రిడ్జి సరిపోవడం లేదు. దీంతో బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ప్రస్తుతమున్న బ్రిడ్జిని తొలగించి రవాణా సదుపాయాలు సాగించేవిధంగా హై లెవెల్‌ బ్రిడ్జిని నిర్మించాలి.

-బినారపు కనకయ్య, గంధమల్ల గ్రామం

కొత్త బ్రిడ్జి నిర్మించాలి

చెరువు మత్తడి నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వారం రోజులుగా రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్తడి కింద ఉన్న బిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ. 10 లక్ష్లలు మంజూరు చేసింది. నిధులు సరిపోవనే ఉద్దేశంతో నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో నిధులు ఆగిపోయాయి. అంతే కాకుండా ఈ చెరువును రిజర్వాయర్‌ చేస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పడంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టలేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రవాణా సదుపాయం కల్పించాలి.

-శాగర్ల పరమేశ, గంధమల్ల గ్రామం

Updated Date - Feb 01 , 2025 | 12:38 AM