చిన్నారులను ఆకట్టుకునేలా..!
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:40 PM
చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలు ఆకట్టుకు నేలా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారుల మొదటి మెట్టు అంగన్‌వాడీ నుంచి ప్రారంభమయ్యే విద్యను బలోపేతం చేస్తూ.. మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పేరును మార్పు చేసి అన్ని కేంద్రాలకు పూర్వ ప్రాథమిక పాఠశాల నామకరణంతో కొత్త విద్యను అందుబాటులోకి తీసు కొస్తుంది.
పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా అంగన్‌వాడీ కేంద్రాలు
ఇట్టే అర్థమయ్యేలా మూడు మాసాలకో పాఠ్యపుస్తకం
రూ.20 లక్షల వ్యయంతో ముస్తాబైన 34 కేంద్రాలు
బాలబాలికలకు ఆకర్షణీయమైన దుస్తులు
భూపాలపల్లి కృష్ణకాలనీ, జనవరి 3 (ఆంధ్రజ్యో తి): చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలు ఆకట్టుకు నేలా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారుల మొదటి మెట్టు అంగన్‌వాడీ నుంచి ప్రారంభమయ్యే విద్యను బలోపేతం చేస్తూ.. మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పేరును మార్పు చేసి అన్ని కేంద్రాలకు పూర్వ ప్రాథమిక పాఠశాల నామకరణంతో కొత్త విద్యను అందుబాటులోకి తీసు కొస్తుంది. మూడేళ్ల నుంచి మొదలు ఆరేళ్ల వరకు చిన్నారులకు అందించే విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అంగన్‌వా డీ కేంద్రాలను అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఇక అంగన్‌వాడీ కేంద్రాలన్ని పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చెందనున్నాయి.
అర్థమయ్యే రీతిలో బోధన
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అర్థ మయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మూడు నెలలకు ఒకసారి మాత్రమే మార్చే పుస్తకాన్ని అందుబాటులో కి తెచ్చారు. ఇదీ అన్ని సెంటర్లకు అందించనున్నారు. పిల్లలకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేపట్టాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తారు. అలాగే, పరిసరాల పరిశుభ్రత, పండగల గురించి వివరించడం, ఇంగ్లీష్ రైమ్స్ వంటి బోధన ఉండనుంది.
ముస్తాబైన 34 కేంద్రాలు..
రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పాలసీ లో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాలన్నింటిని పాఠశాలలుగా మార్చి పెయింటింగ్‌తో పాటు ఇత రత్రా మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 644 కేంద్రాలు ఉండగా తొలుత 34 కేంద్రాలను ఇక్కడి అధికారులు ఎంపిక చేశారు. వీటికి రంగులు వేయడం, తదుపరి ఏబీసీడీ లు, పండ్లు, మొక్కలు గోడలపై వేసి అందంగా ముస్తాబు చేశారు. వీటి రంగులకు గాను ప్రభుత్వం రూ. 20 లక్షలు వెచ్చించింది. వీటితో పాటు 50 సెంటర్లలో త్రాగునీటిని తీర్చేందుకు చర్యలు చేపట్టా రు. అధికారికంగా శనివారం భూపాలపల్లి నియోజ కవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు చేతుల మీదగా ప్రారంభించేదుకు ఆ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు.
కొత్త టీచర్లా.. పాత టీచర్లేనా..?
అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేస్తున్న దృష్ట్యా కొత్తగా టీచర్ల నియామకం చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది. పాఠశాలలుగా మార్చిన నేపథ్యంలో అనుభవజ్ఞులైనా, ఉన్నత విద్యావంతులైన టీచర్ల అవశ్యకత తప్పనిసరి అనివార్యమవుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి, లేదా ఇంటర్ అర్హతతో విధుల్లో చేరినవారే ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. కాగా, ప్రస్తుతం ఉన్న సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ టీచర్లకు ఈ నూతన విద్యావిధా నంపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
అంతంత మాత్రంగానే పనితీరు..
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలు లేకపో లేదు. అద్దె భవనాలు ఉండడం, పౌష్టికాహారం సరిగ్గా పంపిణీ కాకపోవడం, కోడిగుడ్లు పక్కదారి పట్టడం, పిల్లల హాజరు శాతం సరిగ్గా లేకపోవడం, సమయ పాలన పాటించకపోవడం వంటివి ఇన్నాళ్లు ఆయా కేంద్రాల్లో కొనసాగుతూ వచ్చాయి. జిల్లాలోని 12 మండలాల్లో భూపాలపల్లి, మహాదేవ పూర్ రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో మొత్తంగా 644 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రస్తుతం 4,631 మంది గర్భిణులు, బాలింతలు, 11,417 మంది 6 నెలల నుండి 3 సంవత్సరాలున్న చిన్నారులు, 8,692 మంది 3 నుంచి చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
డ్రెస్ కోడ్ వచ్చేసింది..
అంగన్‌వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ పాఠశాలలకు వచ్చే చిన్నారులకు బాలబాలికలకు వేరువేరుగా దుస్తులను అందించేందుకు నిర్ణయం తీసుకోగా జిల్లాకు ఆకర్షణీయమైన దుస్తులు రెండు కలర్స్‌లలో (డ్రెస్‌కోడ్) కూడా వచ్చేసింది. బాలబాలికలకు వేరేవేరుగా స్ర్టిచ్చింగ్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు 8,692 మంది ఉన్నారు. వీరికి గాను మొదటి దఫాలో భాగంగా ప్రస్తుతం 3,558 మంది చిన్నారులకు యూనిఫాం జిల్లాకు రాగా.. స్వయం సంఘాలకు కుట్టడానికి అందించారు.
ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏర్పాట్లు
- చెన్నయ్య, జిల్లా సంక్షేమాధికారి
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అంగన్‌వాడీ సెంటర్లలో ఏర్పాట్లు చేశాం. కేంద్రాల్లోని చిన్నారులకు డ్రెస్‌కోడ్ కూడా వచ్చింది. చిన్నారులకు ఆహ్లాదకరమై న వాతావరణం కల్పించేలా మొదటి దఫాలో ఎంపిక చేసిన కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాం. మరికొద్ది రోజుల్లోనే అన్ని కేంద్రాల్లో మార్పులు జరుగుతాయి.