Share News

Hero Nagarjuna: వారెవ్వా.. సీఎం రేవంత్ చెప్పినట్లే కింగ్ నాగ్ చేశారు..

ABN , Publish Date - Jan 09 , 2025 | 08:07 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సీఎం ఇచ్చిన ఆదేశాలను తాజాగా కింగ్ నాగార్జున చేసి చూపించారు. అయితే, సీఎం రేవంత్ ఏం ఆదేశించారు? నాగ్ చేసిన ఆ పని ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..

Hero Nagarjuna: వారెవ్వా.. సీఎం రేవంత్ చెప్పినట్లే కింగ్ నాగ్ చేశారు..
Nagarjuna And CM Revanth Reddy

ఇటీవల కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ టూరిజంను సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలని.. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వారిని ఆదేశించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకొని వీడియోలు విడుదల చేయగా.. తాజాగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారెవ్వా.. వీడియో మాములుగా లేదుగా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఆ వీడియో ఏంటి? కింగ్ నాగ్ దేన్ని ప్రమోట్ చేశారో తెలుసుకుందాం..


తెలంగాణలో ఉన్న టూరిజంను వివరిస్తూ చక్కటి వీడియోని కింగ్ నాగ్ విడుదల చేశారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, టెంపుల్ టూరిజం, తెలంగాణ వంటకాలను ఆ వీడియోలో ప్రదర్శిస్తూ వివరించారు. తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు, రుచి చూడాల్సిన వంటకాలు, దర్శించుకోవాల్సిన దేవాలయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. తెలంగాణ టూరిజం శాఖ అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు.


వీడియోలో ఏముందంటే..

‘‘చిన్నప్పటి నుంచి తెలంగాణలోని ఎన్నో అందమైన ప్రదేశాలు చూశాను. జోడేఘాట్ వ్యాలీ, ఆదిలాబాద్‌ దగ్గర ఉన్న మిట్టేరు వాటర్‌ఫాల్స్, బొగతా జలపాతం, వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి. రామప్ప ఆలయం. ఇది యునెస్కో గుర్తించిన వరల్డ్‌ హెరిటేజ్‌ కట్టడం. మీరంతా వచ్చి చూడాలి. చాలా అందంగా ఉంటుంది. యాదగిరి గుట్ట, నేను చాలా చాలా సార్లు వెళ్లాను. చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. వచ్చిన వాళ్లు యాదగిరిగుట్టను దర్శించుకోవడం మిస్‌ కావద్దు. తెలంగాణలోని ఫుడ్ విషయానికి వస్తే... తెలంగాణలో నాకు నచ్చిన ఫుడ్ ఏమిటంటే... జొన్న రొట్టేతో అంకాపూర్ చికెన్. స్నాక్స్‌లో చెప్పాలంటే సర్వపిండితో చేసే వంటకాలు చాలా ఇష్టం. ఇక మీకు తెలియంది ఏముంది. ఇరానీ చాయ్‌, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫేమస్‌ ఫుడ్. ఇవన్నీ మర్చిపోలేనివి. మీతో చెబుతుంటేనే నాకు నోటిలో నీళ్లు ఊరుతున్నాయి. తెలంగాణలో నాకు నచ్చింది ప్రజల ఆత్మీయత. ప్రతి ఒక్కర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు. ఏ భాష వాళ్లనైనా ప్రేమతో స్వాగతం పలుకుతారు. చాలా అందంగా ఉంటుంది. మీరంతా తప్పకుండా తెలంగాణ రండీ. వచ్చి ఎంజాయ్ చేయండి. జరూర్‌ ఆనా హమారా తెలంగాణ’’ అని కింగ్ నాగార్జున ఈ వీడియోలో తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 08:09 PM