Telangana Tourism: ప్రపంచ సుందరి పోటీలు వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:06 AM
తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 28న మిస్ వరల్డ్ పోటీలు వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. దీనికి మహీంద్రా, తాజ్, ఒబెరాయ్, మే ఫెయిర్ వంటి ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రప్పించాలని లక్ష్యం
మే 28న నిర్వహించనున్న సర్కారు ఇప్పటికే పలు కంపెనీలకు ఆహ్వానాలు
వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా అడుగులు
దిగ్గజ కంపెనీల హోటళ్లు, రిసార్టుల్లో తెలంగాణ వారికి 25 శాతం చొప్పున రాయితీ!
మహీంద్రా, తాజ్, ఒబెరాయ్, మే ఫెయిర్ సహా.. కొన్ని కంపెనీలతో అధికారుల చర్చలు
రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల వివరణ
ఐదేళ్లలో 15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు వేదికగా.. తెలంగాణకు పెట్టుబడులను రప్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందాల పోటీల బాధ్యతలను చూస్తున్న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా దిగ్గజ కంపెనీలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల సమయంలోనే మే 28న ‘పర్యాటక పెట్టుబడుల సదస్సు (టూరిజం ఇన్వెస్టిమెంట్ సమ్మిట్)’ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదస్సులో పాల్గొనాలంటూ దేశవిదేశాల కంపెనీలకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపింది. పర్యాటక, ఆతిథ్య రంగంలో పేరుగాంచిన మహీంద్రా, తాజ్, ఒబెరాయ్, మే ఫెయిర్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో పర్యాటక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకుఉన్న అవకాశాలను, అందుబాటులో ఉన్న వనరులను వివరిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ స్థలాలు, ఆలయాలు, క్షేత్రాలు తదితర వివరాలను వారికి అందజేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది.
ప్రత్యేకంగా రాయితీలు అందిస్తూ..
కేంద్ర పర్యాటక శాఖ 2022 నివేదిక ప్రకారం 6.07 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 68,400 మంది విదేశీ పర్యాటకులు తెలంగాణలో పర్యటించారు. భవిష్యత్‌లో దేశంలో టాప్ 5 పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపాలని.. రాష్ట్ర జీడీపీలో 10 శాతానికిపైగా పర్యాటకం నుంచే సమకూరేలా ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. పెట్టుబడుల మొత్తం, జరిగే వ్యాపార అంచనాలను బట్టి రాయితీలను వర్తింపజేయనుంది. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూములను తక్కువ ధరకే లీజుకు ఇవ్వనుంది. కాగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించింది. అందులో 9 ప్రాంతాలను తొలుత అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దిగ్గజ కంపెనీల ఆసక్తి, వనరులు, పెట్టుబడులకు అనుగుణంగా ప్రాంతాల ఎంపిక మారే అవకాశం ఉందని అధికారికవర్గాలు చెబుతున్నాయి.
హోటళ్లు, రిసార్టుల్లో తెలంగాణ వారికి 25 శాతం రాయితీ
సాధారణంగా స్టార్ హోటల్స్‌లో పెద్దగా రాయితీలు ఇవ్వరు. సౌకర్యాలను బట్టి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. అయితే దేశ విదేశాలకు చెందిన పెద్ద కంపెనీలు రాష్ట్రంలో ఈ వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో... వాటిలో తెలంగాణ వారికి 25శాతం మేర రాయితీ ఇప్పించాలని పర్యాటక శాఖ భావిస్తున్నట్టు తెలిసింది. నిర్ణీత తేదీలు, రోజుల్లో ఈ రాయితీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయా హోటళ్లు, రిసార్టులకు వెళ్లి తెలంగాణ పౌరుడిగా ఉన్న గుర్తింపు కార్డును చూపించి రాయితీ పొందేలా ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News