‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:34 AM
తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను పూర్తిగా తెలుగు మాధ్యమంలో బోధించేందుకు పెద్ద ఎత్తున కృషి జరగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిలషించారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, జనవరి4(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను పూర్తిగా తెలుగు మాధ్యమంలో బోధించేందుకు పెద్ద ఎత్తున కృషి జరగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిలషించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పదకోశాలు తెలుగులో మరిన్ని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంగ్లం మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదన్నారు. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహను వీడాలన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఆయా దేశాల మాతృ భాషల్లోనే విద్య, పరిపాలన సంబంధిత వ్యవహారాలను కొనసాగిస్తూనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా శనివారం హైటెక్స్‌లోని నోవొటెల్ హోటల్ వేదికగా సాగుతున్న రెండో రోజు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు అధికార భాషగా కొనసాగించడంపై మరింత శ్రద్ధ పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కొనసాగేలా చొరవ చూ పాలన్నారు. న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, తీర్పులు సైతం మాతృభాషల్లో వెలువరించాలన్న సంకల్పానికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా మోదీ ప్రభుత్వం మాతృభాషలకు పెద్ద పీఠ వేసిందని, భారతీయ భాషల్లో ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను, పాఠ్యపుస్తకాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.