Share News

Union Minister Kishan Reddy : పిరికిపందల చర్య

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:18 AM

బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, గుండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ దాడికి దిగడం పిరికిపందల చర్య అని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల

Union Minister Kishan Reddy : పిరికిపందల చర్య

బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మావాళ్లు తల్చుకుంటే గాంధీ భవన్‌ పునాదులు కూడా మిగలవ్‌: బండి

ఎవరు ఎవరిపై దాడిచేసినా ఊరుకోం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

దాడికి పాల్పడ్డవారిపై టీపీసీసీ ఆగ్రహం

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, మహబూబ్‌నగర్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, గుండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ దాడికి దిగడం పిరికిపందల చర్య అని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఖబడ్దార్‌, సహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రె్‌సకు ఉన్న కొద్దిపాటి నాయకులు రోడ్లపై తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంద’’ని అందులో హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతల దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్థంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీని హెచ్చరించారు. ఇక.. బీజేపీ ఆఫీసుపై దాడికి సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌దే బాధ్యత అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు పాల్పడటం ప్రమాదకరమన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్‌ పునాదులు కూడా మిగలవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాళ్లదాడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ గూండా రాజకీయాలు సాగబోవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక సీఎం రేవంత్‌ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.

దీనికి బాధ్యులైన ఎవ్వరినీ వదలబోమని.. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని ఆమె హెచ్చరించారు. ఇక.. పార్టీ కార్యాలయాలపై దాడి చేసే సంస్కృతి సిగ్గుచేటు అని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. కేసీఆర్‌ ఓడిపోయాక రాష్ట్రంలో దాడుల సంస్కృతి పోయిందనుకున్నానని.. కాంగ్రెస్‌ హయాంలోనూ అదే సంస్కృతి కనపడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల ముసుగులో గూండాలు, రౌడీషీటర్లు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని ఎంపీ రఘునందన్‌ ఆరోపించారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్‌ ఆఫీసుపై బుల్డోజర్‌ను ఎక్కించగలమని, తగలబెట్టగలమని, ధ్వంసం చేయగలమని ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరించారు. దాడులతో హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని సీఎం భావిస్తున్నారా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి నిలదీశారు. కాగా.. బీజేపీ కార్యాలయంపై దాడిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. ఏ పార్టీ కార్యకర్తలు ఎవరిపై దాడి చేసినా ఊరుకోబోమని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిని సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఖండించారని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇక.. బీజేపీ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల దాడిని టీపీసీసీ సీరియ్‌సగా పరిగణించింది. నిరసనలు ప్రజాస్వామ్య విధానంలో ఉండాలి తప్ప ఇలా దాడికి వెళ్లడం సరికాదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను మందలించారు.

Updated Date - Jan 08 , 2025 | 05:18 AM